మంత్రివర్గం కూర్పుపై జగన్మోహన్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తయినట్లు  సమాచారం. ముఖ్యమంత్రి కాకుండా మంత్రివర్గంలో 25 మందిని తీసుకోవచ్చు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఒకేసారి 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకోరు. భవిష్యత్ అవసరాల రీత్యా ఓ 20 మందిని మాత్రమే క్యాబినెట్ లోకి తీసుకుంటారు. జగన్ కూడా అదే పద్దతిలో ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

కాకపోతే జగన్ సన్నిహితుల్లో చాలామంది భారీ మెజారిటీలతో గెలిచారు కాబట్టి ఎవరిని తీసుకోవాలి ? ఎవరిని దూరంగా ఉంచాలన్నది జగన్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. అందుకే మొదటిసారి ఎంఎల్ఏగా గెలిచిన వాళ్ళని మంత్రివర్గానికి దూరంగా ఉంచితే ఎలాగుంటుందనే విషయంలో జగన్ ఆలోచిస్తున్నారట. అలా నిర్ణయించినా ప్రతీ జిల్లా నుండి గెలిచిన సీనియర్లే చాలామందున్నారు.

 

ఇదే విషయమై పార్టీలోని కోర్ గ్రూపుతో ఇప్పటికే చూచాయగా ఈ విషయమై ప్రస్తావించినట్లు తెలిసింది.. పాదయాత్ర సందర్భంగానే మర్రి రాజశేఖర్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, చంద్రమౌళికి  మంత్రి పదవులను జగన్ ప్రకటించారు. అయితే చంద్రమౌళి తప్ప మిగిలిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. కాబట్టి ఇక అవకాశం ఉండేది 16 మందికే.

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రేపటి మంత్రివర్గంలోకి జగన్ పరిశీలిస్తున్న వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల్లో ఒకరికి చోటు ఖాయమట. విజయనగరం జిల్లా నుండి బొత్సా సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, పాముల పుష్ప శ్రీవాణి ఉంటారట. విశాఖపట్నం జిల్లా నుండి అవంతి శ్రీనివాస్. తూర్పు గోదావరి జిల్లా నుండి పినిపె విశ్వరూప్, పిల్లి ఉంటారు.

 

పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఆళ్ళనానికి అవకాశమట. కృష్ణా జిల్లా నుండి కొలుసు పార్ధసారధి, కొడాలి నాని. గుంటూరు జిల్లా నుండి మర్రి రాజశేఖర్, ఆళ్ళ, కోన రఘుపతి. ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. కర్నూలు జిల్లా నుండి బుగ్గన రాజేంద్రనాధరెడ్డికి అవకాశమట. అనంతపురం జిల్లా నుండి అనంత వెంకట్రామరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి.

 

చిత్తూరు జిల్లా నుండి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెంకటస్వామి లేదా రోజా అట. మైనారిటీ కోటాను ఏ జిల్లా నుండి భర్తీ చేయాలో తేలలేదట. స్పీకర్ గా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అలాగే డిప్యుటి స్పీకర్ గా మైనారిటీ ఎంఎల్ఏని ఎంపిక చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: