రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని సెంటిమెంట్లు భ‌లే ఉంటాయి. అలాంటి సెంటిమెంటే తాజాగా అనంత‌పురం జిల్లాలో వ‌ర్క‌వుట్ అయింది. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందుతారో ఆ పార్టీ అభ్యర్థి అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా నడుస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది.


 గత 7 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించడంతో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో శింగనమల సెంటిమెంట్‌ మరోసారి రుజువు అయ్యింది. ప్ర‌ధానంగా, రాయలసీమలో వైసీపీ ప్రభజనం సృష్టించింది. ముందుగా అధినేత జగన్ సొంత జిల్లా కడపలె పార్టీ  క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల నుంచి పార్టీ అధినేత జగన్ 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2014 లోనే జగన్ వైపు నిలిచిన కర్నూల్ జిల్లా ఈ సారి ఆ బలాన్ని మరింత పెంచుకొని క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక చిత్తూరులో మొత్తం 14 స్థానాలు ఉండగా 13 సీట్లను వైసీపీ కొల్లగొట్టింది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఆయన ఒక్కరు మాత్రమే గెలవగలిగారు. ఇక అనంతపురంలో హిందూపూర్, ఉరవకొండ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. తమ పార్టీకి సాంప్రదాయంగా వస్తున్న హిందూపూర్ స్థానంలో బాలయ్య మరోసారి సత్తా చాటగా..ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఉత్కంఠ పోరులో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక రాజకీయ ప్రాభవం కలిగిన కోట్ల, కేఈ కుటుంబాలు తమ ప్రాభవాన్ని కొల్పోయాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: