జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాక్ తగలనున్నట్లు సమాచారం. పార్టీ తరపున గెలిచిన ఏకౌక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ వైసిపిలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జనసేన వర్గాలే చెప్పాయి.  పార్టీ తరపున 130 మంది పోటీ చేస్తే తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పోటీ చేసిన వరప్రసాద్ మాత్రమే గెలిచారు. చివరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాక లో ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

 

పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ కావటంతో రాపాక జనసేనలో ఉండటానికి ఇష్టపడటం లేదు. పైగా తనకు బాగా సన్నిహితులైన సహచరులు వైసిపిలో కీలక పాత్ర పోషిస్తున్నారట. దాంతో తాను వైసిపిలోకి వచ్చేస్తానని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, మంత్రివర్గం కూర్పులో బిజీగా ఉన్న జగన్ తో చెప్పి ఒప్పించాలని తన సన్నిహితుల దగ్గర రాపాక అన్నట్లు తెలిసింది.

 

అయితే రాపాక ప్రయత్నాలను జగన్ సన్నిహితులు ప్రస్తుతానికి అడ్డుకున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో ఉన్న జగన్ తో ఈ విషయం ప్రస్తావించేందుకు సమయం పడుతుందని, అందులోను ఇతర పార్టీల్లో గెలిచిన వారిని వైసిపిలోకి తీసుకునే ఉద్దేశ్యంలో జగన్ లేరని స్పష్టం చేశారట. జనసేన ఎంఎల్ఏగా  రాజీనామా చేయటం, మళ్ళీ ఉపఎన్నిక జరగటం జగన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు.

 

పైగా ఇతర పార్టీల నుండి ఎంఎల్ఏలను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని  జగన్ భావనతో ఉన్నారట. అంటే కారణాలేవైనా కానీండి రాపాక మాత్రం జనసేనలో ఎంతో కాలం ఉండరని కూడా అర్ధమైపోతోంది. రాపాక ఉంటున్నది జనసేనలోనే అయినా ఆయన మనస్సంతా వైసిపిలోనే తిరుగుతోంది. కాబట్టి జనసేన ఏకైక ఎంఎల్ఏ జంప్ అయిపోవటం ఖాయమే అనిపిస్తోంది. కాకపోతే ఎప్పుడన్నదే సస్పెన్స్

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: