టీడీపీ చరిత్రలో ఇటువంటి ఓటమిని కలలో కూడా ఉహించిఉండదు. పార్టీ పాతాళంలోకి కూరుకుపోయింది. పార్టీ నేతలకు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు విజేతలు, పరాజితులు శుక్రవారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమిపై అధినేత వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. మెజార్టీ మార్కుకు 10-15 సీట్లు తక్కువ వస్తాయనుకుంటే.. ప్రజలు మరీ ఇంత ఘోర ఓటమిని కట్టబెట్టారని వారు చంద్రబాబు వద్ద వాపోయారు.


చంద్రబాబు సైతం నేతల వద్ద అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘మనకు 23 సీట్లే వచ్చాయి. వైసీపీ మాత్రం 151 స్థానాలు గెలుచుకుంది. మనం నిజంగా అంత ఘోరమైన తప్పిదాలు చేశామా?, ప్రజలను అంతగా కష్టపెట్టామా? అని చంద్రబాబు నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫలితాలపై లోతుగా విశ్లేషించి ఓటమికి గత కారణాలపై అధ్యయనం చేయాలని నేతలకు సూచించారు.


జనసేన వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదని, పవన్ టీడీపీకి స్నేహితుడేనంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మడంతో వ్యతిరేక ఓటు మొత్తం వైసీపీకే వెళ్లిపోయిందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలే అన్న సమాధానం చాలామంది నేతల నుంచి వస్తోంది. ఆ కమిటీల పేరుతో కొందరు పెత్తనం చెలాయించడంతో పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రభుత్వ పథకాల అమలుకు కూడా కమిషన్లు తీసుకోవడంతో వ్యతిరేకత పెరిగిందని అంచనా వేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వంపై ప్రజలకు మంచి అభిప్రాయమే ఉన్నా... స్థానిక నేతల అరాచకాల వల్ల ఓటుబ్యాంకు మొత్తం వైసీపీకి వెళ్లిపోయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: