తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జగన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం వైఎస్‌ఆర్‌సీపీ ఎల్పీ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. 


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా నరసింహన్‌కు విజ్ఞప్తి చేస్తారు.  ఈ స‌మావేశం చూడ‌టానికి సాదాసీదా స‌మావేశం రీతిలో ఉన్న‌ప్ప‌టికీ దీని వెనుక ప‌లు అంశాల‌ను గుర్తుకు చేస్తున్నారు. ``10 ఏళ్ల తరువాత తన తండ్రి కట్టించిన క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కొడుకు గా బయటకు వెళ్లి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి హోదా అదే క్యాంప్ ఆఫీస్ లో అడుగుపెడుతున్న జగన్...ప‌క్కనే ఉన్న దిల్ కుష గెస్ట్ హౌజ్ కు కొన్నేళ్ల కింద నిందితుడిగా వచ్చి అరెస్ట్ అయిన జగన్, ఇప్పుడు రాజ్ భవన్ కు సీఎంగా వచ్చాడు. ఏ రోడ్డు లో అయితే అరెస్ట్ అయ్యాడో అదే రోడ్డులో ముఖ్యమంత్రి గా అడుగిడాడు`` అంటూ ప‌లువురు విశ్లేషిస్తున్నారు. 


కాగా,  తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలంతా నేడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిసి పార్టీ తీర్మాన ప్రతిని అందజేశారు. అనంత‌రం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలసిందిగా విజ్ఞప్తి చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: