అచ్చ‌తెలుగు అమ్మాయిగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన మాధ‌వీల‌త తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. ఒక‌ప్పుడు వెండితెర మీద అడ‌పాద‌డ‌పా త‌ళుక్కుమ‌న్నా ఇప్పుడు సినిమాలు లేక మ‌ధ్య‌లో కొన్ని రోజులు యూఎస్‌లో ఉండి తిరిగి ఇండియాకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో త‌న ఇంట‌ర్‌వ్యూల‌తో హ‌ల్చ‌ల్ చేస్తున్న మాధవీల‌త సోష‌ల్ మీడియాలో త‌న మాట‌లు, చేత‌ల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉంటున్నారు. కొద్ది నెల‌ల క్రితం బీజేపీలో చేరిన మాధ‌వీల‌త ఏపీలోని గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. వాస్త‌వానికి మాధ‌వీల‌త‌కు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ సీటు రావ‌డం చాలా ఆస‌క్తిక‌ర‌మే. ఎన్నిక‌ల బ‌రిలో ఆ నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. 


ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సొంత జిల్లా కావ‌డంతో ఆయ‌న చాలా మందికి ఆచి తూచి సీట్లు ఇచ్చారు. అయితే మాధ‌వీల‌త ఏదోలా ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకుంది. ఏపీలో బీజేపీని ఓట‌రు స‌మాధి చేసేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత బీజేపీ ఆదుకుంటుంద‌ని న‌మ్మిన ఏపీ ప్ర‌జ‌ల‌కు ఆ పార్టీ చేసిన ద్రోహానికి, వైజాగ్ రైల్వే జోన్ విభ‌జించిన తీరుకు తీవ్ర‌మైన అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో బీజేపీకి ఒక్క చోటంటే ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. ఇక వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన మాధ‌వీల‌తకు వ‌చ్చిన ఓట్లు ఇప్పుడు పెద్ద షాక్‌గా మారాయి. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మాధ‌వీ ల‌త‌కు 1900 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఓ సెల‌బ్రిటీ హీరోయినై ఉండి కూడా మాధ‌వీ ల‌త బీజేపీ నుంచి పోటీ చేస్తేనే ఏపీ ప్ర‌జ‌లు ఆద‌రించ‌లేదంటే ఏపీ ప్ర‌జ‌ల‌కు బీజీపై ఎంత క‌క్ష ఉండో అర్థం అవుతోంది. 


క‌నీసం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీకి గ‌తంలో ఉన్న సాంప్ర‌దాయ ఓట్లు కూడా ఇప్పుడు మాధ‌వీ ల‌త‌కు రాలేదు. దీంతో మాధ‌వీల‌త‌ను చూసి ఎవ‌రూ ఓట్లు వెయ్య‌లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఒక్క మాధ‌వీ ల‌తే కాదు ఏపీ బీజేపీ నుంచి పోటీ చేసిన మ‌హామహులైన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి లాంటి వాళ్లు సైతం మ‌ట్టిక‌రిచారు. అదే స‌మయంలో జ‌గ‌న్ ఫ్యాన్ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకుని సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ గెలిచింది. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు ఈ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్థి చంద్ర‌గిరి యేసుర‌త్నం, జ‌న‌సేన అభ్య‌ర్థి తోట చంద్ర‌శేఖ‌ర్, బీజేపీ నుంచి పోటీ చేసిన మాధ‌వీ ల‌తను చిత్తు చేసి ఘ‌న విజ‌యం సాధించారు. ఏదేమైనా ఏపీలో బీజేపీకి క‌ను చూపు మేర‌లో కూడా భ‌విష్య‌త్తు ఉండేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: