రాహుల్ గాంధీ త‌మ ఫ్యామిలీకి కంచుకోట అయిన అమేధీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయాడు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ కుటుంబాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ ట‌చ్ చేయ‌లేదు. అలాంటి చోట రాహుల్‌పై స్మృతి ఇరానీ సంచ‌ల‌నం విజ‌యం సాధించ‌డంతో పాటు జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు. ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో ఉన్న నాయ‌కుడికి ఇది నిజంగా ఘోర‌ప‌రాభ‌వ‌మే. పార్టీ ఓట‌మి వేరు.. తాను స్వ‌యంగా ఓడిపోవ‌డం వేరు. గ‌తంలో రాయ్‌బేరీలీలో రాహుల్ నాయ‌న‌మ్మ ఇందిరాగాంధీ ఎంత‌టి ఘోర‌ప‌రాజ‌యం చూశారో ఇప్పుడు రాహుల్ ఆ స్థాయిలో కాక‌పోయినా ఓడిపోయారు.


నాడు రాయ్‌బరేలీలో ఇందిర ప‌రాభ‌వం చ‌రిత్ర‌లోనే లిఖించిపోయింది. త‌న నియంతృత్వ వైఖ‌రితో దేశ‌వ్యాప్తంగానే ఆమె తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు కొని తెచ్చుకున్నారు. త‌న‌కు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను భ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి.. త‌న‌కు పోటీ వ‌స్తార‌నుకున్న నాయ‌కుల‌ను జైళ్ల‌లో పెట్టి నానా చిత్ర‌హింస‌లు పెట్టించింది. ఫ‌లితంగా 1977లో దేశంలోనే తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వంగా జ‌న‌తా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. త‌ర్వాత ఇందిర త‌న కుయుక్తులు వాటి ఆ ప్ర‌భుత్వాన్ని దించేసింది. అది వేరే సంగ‌తి. ఇక రాహుల్ ఇప్పుడు నియంత కాక‌పోయినా అస‌మ‌ర్థుడే అన్న ముద్ర మాత్రం వేయించుకున్నాడు.


ఈ ఎన్నిక‌ల్లో రాహుల్‌ను ఓడించేందుకు బీజేపీ అధిష్టానం.. ముఖ్యంగా అమిత్ షా ఆప‌రేష‌న్ అమేథీ స్టార్ట్ చేశాడు. ఈ బాధ్య‌త‌లు యూపీ సీఎం యోగీకి అప్ప‌గించాడు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఆరు నెల‌ల నుంచే కులాల వారీగా నేత‌ల‌ను కోట్లు పోసి కొన్నారు. సాధార‌ణంగా ఓ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచేందుకు ఎవ‌రైనా రూ.100 కోట్లు గ‌ట్టిగా పెట్టాల‌నుకుంటే పెడ‌తారు. ఇంకా పెడితే రూ.150 కోట్లు. అమేధీలో బీజేపీ ఏకంగా రూ.500 కోట్లు పెట్టి మ‌రీ రాహుల్‌ను ఓడించిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాల క‌థ‌నం. కొంత‌కాలంగా అక్క‌డ కాంగ్రెస్‌కు బ‌లంగా ఉన్న వారిని ఏరీ కోరి మ‌రీ వెతికి వారికి ఏం కావాలో పిలిచి మ‌రీ డ‌బ్బులు కుమ్మ‌రించేశార‌ట‌.


రాయ్‌బ‌రేలీలో సోనియాను కూడా ఇలాగే ఓడించాల‌నుకున్నా అక్క‌డ బీజేపీ పాచిక పార్లేదు. సోనియా ఎలాగోలా గ‌ట్టెక్కారు. ఇక ఇక్క‌డ గెలిచేందుకు కాంగ్రెస్ కూడా త‌న శ‌క్తికి మించి రూ.150 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఇక్క‌డ ప‌రిణామాల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టిన రాహుల్ అందుకే కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి కూడా పోటీ చేశారు. పేరుకు ఉత్త‌రాదిన ఒక సీటు... ద‌క్షిణాదిన ఒక సీటు అని చెప్పుకున్నా దాని వెన‌క రాహుల్‌కు అమేధీలో త‌న ఓట‌మి ముందే అర్థ‌మైంద‌న్న టాక్ ఉంది. ఏదేమైనా దేశంలోనే ఖ‌రీదైన ఎన్నిక‌లో రాహుల్ ఓడితే స్మృతి ఇరానీ గెలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: