ఏపీ కాబోయే ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త‌న ఎన్నిక‌ల హామీలు మ‌రియు పార్టీ విధానాల ప‌ట్ల ఎంత చిత్త‌శుద్ధితో ఉంటారో తెలియ‌జేసేందుకు ఇదో నిద‌ర్శ‌నం. ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన జగన్ మోహన్ రెడ్డి ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి హోదాలో త‌న తొలి భేటీలోనే ఏపీలో కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా గురించి గ‌లం విప్పారు. ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీ వ‌ద్ద స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి హోదా అత్యంత ఆవ‌శ్య‌క‌మైన అంశ‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జ‌గ‌న్ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి అధికార నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్ వెళ్లారు. ఉదయం 10.40 గంటలకు ప్రధానితో సమావేశం అయ్యారు. జగన్ వెంట సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నందిగం సురేశ్, భరత్, బాలశౌరి ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోడీకి ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి కేంద్ర సహాయం, ప్రత్యేక హోదా గురించి జగన్ చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనపు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను సత్వరమే నెరవేర్చాలని కోరారు.


ప్రధానితో భేటీ అనంతరం ప్ర‌ధాని నివాసం నుంచి జ‌గ‌న్‌ ఆంధ్రప్రదేశ్ భవన్‌కు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా పలువురు అధికారులు, ఢిల్లీలోని ప్రముఖులతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి ఏపీకి ప్రయాణమవుతారు. కాగా, తొలి స‌మావేశంలోనే జ‌గ‌న్ ఏపీ స‌మస్య‌లను ప్ర‌స్తావించ‌డం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: