ఏపీలో అధికార తెలుగుదేశం ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు వచ్చిన తక్కువ సీట్లు ఏ ఎన్నికల్లోనూ రాలేదు. 1989 లో ఎన్టీఆర్ తొలిసారిగా ఓడిపోయినా 90కి పైగా అసెంబ్లీ స్థానాలు టిడిపి గెలిచింది. చివరకు 2004లో వైయస్ ప్రభంజ‌నంలోనూ ఆ పార్టీకి 47 స్థానాలు దక్కాయి. 2009లో ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోరులో టిడిపి 92 స్థానాలతో గౌరవప్రదంగా స్కోర్‌ దక్కించుకుంది. ఇక తాజా ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో ఇంకా చెప్పాలంటే... మాటిమాటికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన రాజకీయ అనుభవం అంత వయసు లేని జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టుగా ఐదేళ్ళపాటు నవ్యాంధ్రను అభివృద్ధి చేయమని చంద్రబాబుకు పగ్గాలు అప్పగిస్తే చంద్రబాబు  రాష్ట్ర పాలన తన ఇష్టానుసారంగా చేశారు. 


ఎన్నికలకు దాదాపు యేడాదిన్నర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ వచ్చింది.  దీనిని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు ఎంత మాత్రం ప్రయత్నాలు చేయలేదు. మాటమాటకి ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉందని చెపుతున్నారు తప్ప తన వెనక ఉండి గొప్పలు చెబుతూ తన పతనాన్ని తన చుట్టుపక్కల ఉన్న వారే శాసించారు అన్న విషయాన్ని చంద్రబాబు సరిగా అర్థం చేసుకోలేక పోయారు. ఇక  ఆ పార్టీకే చెందిన తొమ్మిది మంది ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మికి పెద్ద విల‌న్లుగా ప‌ని చేశార‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జోరుగా జ‌రుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ అభిమాని నా ర‌క్తంతో చంద్ర‌బాబుగారికి  ఉత్త‌రం రాశాన‌ని ఆ 9 మందిని నానా భూతులు తిడుతూ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 


తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైన వీళ్ళు కనపడితే పిచ్చ కొట్టుడు కొట్టాల‌ని అత‌డు చేసిన వ్యాఖ్య‌లు కూడా వైరల్ అవుతున్న ఆ మెసేజ్ లో ఉంది. వీళ్లు చంద్రబాబుని చేసిన మోసం అంతా ఇంతా కాదని కూడా ఆ అభిమాని తన ఉత్తరంలో పొందుపరిచాడు. ఈ 9 మందిలో కుటుంబ‌రావు - ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యాల‌య కార్య నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి టీడీ. జ‌నార్థ‌న్ - ఎమ్మెల్సీ వీవీవీ. చౌద‌రి - ఇర‌వైసూత్రాల సాయి - లోకేష్ గురువుగా చెప్పుకునే పెద్ది రామారావు - లోకేష్ స్నేహితుడు కిలారు రాజేష్ - శ్రీ‌నివాసుల నాయుడు - కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి - తాజా మాజీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుపై స‌ద‌రు అభిమాని త‌న ఉత్త‌రంలో తీవ్ర‌మైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. 


ఇక నుంచి అయినా చంద్రబాబు  వీళ్ళని తన దగ్గరకు రానివ్వకుండా... అబ‌ద్ధ‌పు మాట‌లు చెప్పే నేత‌ల‌ చేతుల్లో మోసపోకుండా చూసుకోవాలని ఈ అభిమాని తన బాధ వ్యక్తం చేశాడు. వీళ్లలో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇచ్చేలా పాజిటివ్ రిపోర్టులు తయారు చేసేందుకు డబ్బులు కూడా తీసుకున్నారని ఆ లెటర్‌లో పేర్కొన్నాడు. ఈ తొమ్మిది మంది వ్యక్తులు చంద్రబాబు చుట్టూ చేరి ఆయన పూర్తిగా తప్పుదోవ పట్టించారని ఈ అభిమాని చెప్పారు. నా రక్తంతో రాసిన ఈ ఉత్తరాన్ని చంద్రబాబు గారుచదివి ఇక నుంచి అయినా పార్టీలో ప్రక్షాళన చేయకపోతే పార్టీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా పేర్కొనడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: