ఒకప్పుడు పొలం పనులు చేసుకుని బతికిన వ్యక్తిని ఎంపీగా చేశారు జగన్‌. అతడే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ...ఆయన ప్రెస్‌మీట్‌లలో వెనకుండి టీవీలో కనిపిస్తే చాలనుకున్నవ్యక్తి ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతూ, ఆదివారం జగన్‌తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి, ఏకంగా ఆయనతో ఫోటో దిగటం కలలో కూడా ఊహించని అరుదైన విజయ గాథ .

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినపుడు, ఇందిరమ్మ ఇల్లు ద్వారా లబ్ది పొందిన అతడు ఆ విశ్వాసాన్ని జగన్‌ మీద చూపాడు. జగన్‌కి వ్యతిరేకంగా చెప్పాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, పోలీస్‌ అధికారులు బెదిరింపులకు ఏమాత్రం తలొగ?్గలేదు. నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడ్డాడు. ఆ పేదోడి, మొండి ధైర్యమే....కలలో కూడా ఊహించని అవకాశాన్ని తలుపుతట్టింది.

అతని నిబద్ధత, నిజాయితీ వైఎస్‌ జగన్‌ను ఆకట్టుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా నందిగం సురేష్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా గెలుపు బాధ్యతను కూడా తీసుకొని, చేతలలో చూపించారు. బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ ఎంపీగా సురేష్‌ విజయం సాధించడం అందరినీ నివ్వెరపరిచింది. వైఎస్‌ జగన్‌ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం, నందిగం సురేష్‌ను ఎంపీగా ఓటర్లు అతనికి జై కొట్టేలా చేసింది.

 భూముల కోసం పోరాటం 

నందిగం సురేష్‌ గతంలో రాజధాని భూముల కోసం పోరాటం చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంకు చెందిన సురేష్‌ పదో తరగతితో చదువు ఆపేసి, పొలం పనులు చేశారు, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా ఎదిగారు. రాజధాని ప్రాంతంలో రైతులు తమ భూములు ఇవ్వడానికి ఎదురు తిరిగిన వారిలో నందిగం సురేష్‌ కూడా ఉన్నారు. తమకున్న రెండెకరాల అసైన్డ్‌ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని భూముల కోసం పోరాటం చేశారు. దాంతో కక్ష సాధింపు చర్యగా ఆయనపై కేసులు పెట్టారు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే అని చెప్పాలంటూ.. అతడిని పోలీసులు బెదిరించారు. చివరకు ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు  సారీ చెప్పి పంపించేశారు.

నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి, కూలీ పనులకు వెళ్లే తనకు ఎంపీగా అవకాశం ఇచ్చారంటూ భావోద్వేగం తట్టుకోలేక కన్నీరు పెట్టారు. జగనన్న తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉంటానని సురేష్‌ అంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: