ఏపీలో తాజా ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీలో ఖ‌చ్చితంగా గెలుస్తారు అనుకున్న మహామహులు సైతం కొట్టుకుపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వారిలో  ముగ్గురు మంత్రులు మినహా ఇతర కీలక నేతలంతా తుఫాన్‌కు మహా మహా వృక్షాలు నేలకొరిగినట్టు కూలిపోయారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ భవిష్యత్తు ఆశాకిరణం, మంత్రిగా ఉన్న లోకేష్ కూడా రాజధాని ప్రాంతమైన మంగళగిరి సీటు నుంచి పోటీ చేసి  ఓడిపోయాడు.  గత నాలుగేళ్లలో టీడీపీ పాలన అంత కృష్ణా, గుంటూరు జిల్లాల చుట్టూనే తిరిగింది. అందులోనూ మంగళగిరి ప్రాంతాన్ని రాజధానిగా చేయడంతో అక్కడ టిడిపికి తిరిగి ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 


ఇంతటి సునామీలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వివాదాల రారాజు చింతమనేని ప్రభాకర్ సైతం కొట్టుకుపోయాడు. 2009, 2014 ఎన్నికల్లో దెందులూరు నుంచి వరుస విజయాలు సాధించిన ప్రభాకర్ ఈ ఎన్నికల్లో గెలుపు తనది అని పూర్తి ధీమాతో ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే దెందులూరు నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా చింతమనేని అరాచక పాలన కొనసాగింది. ఆ నియోజకవర్గానికి తానే  లా అండ్ ఆర్డర్ అన్న‌ట్టుగా చింత‌మ‌నేని పాల‌న కొన‌సాగింది. చింతమనేనికి ఎవరైనా అడ్డొస్తే అంతే సంగతులు. దీంతో ఆయనకు భయపడి ఎదుర‌య్యేందుకు ఎవరు సాహసించని పరిస్థితి. తాజా ఎన్నికల్లో చింతమనేనిపై కొఠారు అబ్బయ్య చౌదరి 18 వేల ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ఇక ఈ నియోజకవర్గంలో ఉన్న ఓ సెంటిమెంట్ కు తాజా ఎన్నికల్లో చింతమనేని బలికాక తప్పదు. 


తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఇక్కడ నుంచి రెండు సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేలు మూడోసారి ఓడిపోతున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో సీనియర్ నేత గారపాటి సాంబశివరావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, తిరిగి 1985లోనే మరోసారి ఆయన విజయం సాధించారు. 1989లో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభంజ‌నంలో గారపాటి ఓడిపోయారు. తిరిగి 1994, 1999 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన 2004లో నాటి కాంగ్రెస్ ప్రభంజ‌నంలో రెండో సారి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. 


ఇక 2009లో తొలిసారి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి గెలిచారు. తాజా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టి రికార్డులు కొడతానని బీరాలు పోయిన చింతమనేనికి అబ్బ‌య్య‌ చెక్‌ పెట్టాడు. దీంతో దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి రెండు సార్లు వ‌ర‌స‌గా గెలిచిన వారు ఎవ‌రైనా మూడో సారి ఓడిపోక త‌ప్ప‌ద‌న్న సెంటిమెంట్ మ‌రో సారి రుజువు అయ్యింది. విచిత్రం ఏంటంటే గ‌తంలో 1989, 2004లో నాటి కాంగ్రెస్ ప్ర‌భంజ‌నంలో గార‌పాటి ఓడిపోతే తాజాగా వైసీపీ ప్ర‌భంజ‌నంలో చింత‌మ‌నేని ఓడిపోయారు. ఏదేమైనా ఇక్క‌డ చింత‌మ‌నేనికి అబ్బ‌య్య దెబ్బ అదిరిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: