ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ను జ‌గ‌న్ క‌లిశారు. అనంత‌రం ఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


పొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జ‌గ‌న్ అన్నారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు. సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కి తానే ఒక అడుగు ముందుకేసి మాకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలను కలిసి సాధిద్దామని పెద్దాయన (సిఎం కేసీఆర్) ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటు లో టీఆర్ఎస్ ఎంపీలు మీతో ఉంటారని పెద్దాయన స్పష్టం చేశారు. ఏపీలో 22, తెలంగాణ 9, మొత్తం 31మంది ఎంపీలం ఒకరి కోసం ఒకరి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరం సీఎం లం కలిసి పని చేస్తాం`` అని ప్ర‌క‌టించారు.


కాగా, వైఎస్ జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మ‌ర‌ణం అనంత‌రం ప‌లువురు ఆయ‌న్ను పెద్దాయ‌న‌గా పిలుచుకున్న సంగతి తెలిసిందే. పెద్దాయ‌న చ‌నిపోయాడ‌ని ఎంద‌రో గుండెలు అవిసేలా రోదించారు కూడా. అలాంటి ప‌దంతో కేసీఆర్‌ను జ‌గ‌న్ పిలవ‌డం గ‌మ‌నార్హం. కాగా, త‌న కంటే వ‌య‌సులో పెద్ద‌వారిని జ‌గ‌న్ అలా పిలుస్తుంటార‌ని, ఇందులో వేరే ఉద్దేశం లేద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: