కొత్తగా ఏర్పడబోయే అసెంబ్లీకి స్పీకర్ గా కోన రఘుపతి పేరు పరిశీలనలో ఉందా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. కోన రఘుపతి మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుండి సుమారు 16 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. 2014లో కూడా టిడిపి అభ్యర్ధి అన్నంపైనే రఘు గెలిచారు.

 

సౌమ్యునిగా పేరున్న రఘు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. మొన్నటి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం తరపున నలుగురు పోటీ చేసిన రఘుతో పాటు మల్లాది విష్ణు మాత్రమే గెలిచారు. మిగిలిన ఇద్దరు అక్కరమని విజయనిర్మల, ద్రోణంరాజు శ్రీనివాస్ ఓడిపోయారు.

 

ప్రస్తుతానికి వస్తే మంత్రివర్గంలో ఎవరికి చోటనే విషయంలో అనేక పేర్లు ప్రచారం జరుగుతోంది. సమస్య ఏమొచ్చిందంటే ఉన్న అవకాశం పరిమితం. గెలిచిన వాళ్ళ సంఖ్య మాత్రం అపారం. అందులోను జగన్ సన్నిహితులుగా ముద్రపడిన వాళ్ళే చాలా ఎక్కువమందున్నారు. దాంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నదే ప్రధాన సమస్య. ముందు రఘును మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగినా తాజగా స్పీకర్ గా పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు.

 

ఇందులో భాగంగానే స్పీకర్ గా కోన రఘుపతిని నియమిస్తే ఎలాగుంటుందని జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓపికగా ఉంటాడు, సౌమ్యుడు అనే పేరుంది రఘుకి. దాంతో పాటు రఘు తండ్రి కోన ప్రభాకర్ రావు కూడా గతంలో అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేశారు. ఒకవేళ రఘు గనుక స్పీకర్ గా నియమితులైతే బహుశా తండ్రి, కొడుకులు స్పీకర్లుగా పనిచేయటం రికార్డవుతుందేమో ?

 

    


మరింత సమాచారం తెలుసుకోండి: