తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టిఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బిజెపి 4, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందాయి. గతంలో టిఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది. 16 సీట్లు గెలుచుకుంటానని బల్లగుద్దినట్టు చెప్పిన కేసీఆర్ కు షాక్ తగిలేలా ఫలితాలు వచ్చాయి. 


నల్లగొండలో ఉత్తమ్ గెలుపు

నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహా రెడ్డి పై 19070 ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలిచారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధ్యక్షునిగా మరియు హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


నాగర్‌కర్నూల్‌లో టిఆర్ఎస్ విజ‌యం

 నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిపై రాములు గెలుపొందారు. రాములుకు 476123 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 293529 ఓట్లు పోలయ్యాయి. 182594 ఓట్ల మెజార్టీతో రాములు విజయం సాధించారు.
 

మెదక్‌లో కారు జోరు 

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి గాలి అనిల్ కుమార్ పై 3లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు. మొత్తం పోలైన ఓట్లలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి 572321 ఓట్లు రాగా, గాలి అనిల్ కుమార్ కు 263428 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 192048 ఓట్లు పోలయ్యాయి.
 

భువనగిరిలో కోమటిరెడ్డి గెలుపు

భువనగిరి పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. టిఆర్ఎస్ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 5 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహంలో సంబరాలు చేసుకున్నారు. కోమటిరెడ్డి గతంలో నల్లగొండ ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు.
 

మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి 5 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్ధి పై ఆయన విజయం సాధించారు. ఆది నుంచి ఇద్దరి మధ్య ఉత్కంఠగా పోరు నడిచింది. చివరకు రేవంత్ రెడ్డి 10 వేల ఓట్ల పై చిలుకుతో ఆయన విజయం సాధించారు. రేవంత్ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో విజయోత్సవాలు నెలకొన్నాయి.
 

వరంగల్‌లో అత్య‌ధిక‌ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ప‌సునూరి ద‌యాక‌ర్ విజయం

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు 566367 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యకు 240101 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి 77325 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 326266 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపీగా పసునూరి దయాకర్ గెలుపొందారు.
 

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో కారు జోరు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో టిఆర్‌ఎస్ అభ్య‌ర్థి మ‌న్నె శ్రీనివాస్‌రెడ్డి విజ‌యం సాధించారు. 54942 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. బిజెపి అభ్యర్ధి డికె అరుణ పై శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. 


కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా వీస్తుంటే కరీంనగర్‌లో మాత్రం కమలం వికసించింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన  బండి సంజయ్ కు సానుకూల పవనాలు వీచాయి. గత ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ గెలవడంతో బిజెపి శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు.
 

ఖ‌మ్మంలో నామా నాగేశ్వ‌ర‌రావు భారీ విజ‌యం

ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానంలో టిఆర్‌ఎస్ భారీ విజ‌యం సాధించింది. ల‌క్షా 66 వేల ఓట్ల‌తో టిఆర్‌ఎస్ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర్‌రావు విజ‌యం సాధించారు. రేణుకా చౌదరి రెండో స్థానంలో నిలిచారు.


మ‌హ‌బూబాబాద్‌లో 77,121 ఓట్ల‌తో టిఆర్‌ఎస్ గెలుపొందింది. మహబూబాబాద్ లో మాలోతు కవిత విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి బలరాం నాయక్ పై కవిత విజయం సాధించారు. 


నిజామాబాద్ లో బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్ధి కవిత పై 68 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది టిఆర్ఎస్ కు పెద్ద షాక్ గా చెప్పవచ్చు. 


పెద్దపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్ధి వెంకటేష్ నేతాని విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి చంద్రశేఖర్ నిలిచారు. 
ఆదిలాబాద్ లో బిజెపి అభ్యర్ధి సోయం బాపూరావు ఘన విజయం సాధించారు. టిఆర్ ఎస్ అభ్యర్ధి నగేష్  పై ఆయన గెలుపొందారు. 
 హైదరాబాద్ పార్లమెంటు ఫలితాల్లో అసదుద్దీన్ ఓవైసి ఘన విజయం సాధించారు. ఈ సీటు గత కొన్నేళ్లుగా ఎంఐఎం వశం అవుతోంది. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. 
జహీరాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి బిబిపాటిల్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ మోహన్ రావు పై పాటిల్ విజయం సాధించారు. 


సికింద్రాబాద్ పార్లమెంటు ఫలితాల్లో బిజెపి కమలం వికసించింది. కిషన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్ధి తలసాని సాయికిరణ్ ఓటమి పాలయ్యారు. 
చేవేళ్లలో కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డి విజయం సాధించారు. ఆది నుంచి కొండా ఆధిక్యత కనపర్చినా చివరకు ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: