తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ నాయకుడు. అవకాశం వస్తే ఆయన ప్రధాని పదవి రేసులో ఉంటారని నిన్నటివరకూ వినిపించింది. బాబు సైతం తాను మోడీ కంటే సీనియర్ అని పదే పదే చెప్పుకున్నారు. తన వల్లే మోడీ ప్రధాని అయ్యారని అన్నారు. టీడీపీ కేంద్రం నుంచి బయటకు వచ్చిన రోజే మోడీ  పతనం మొదలైందని అంటూ హాట్ కామెంట్స్ చేశారు.


చివరికి ఏమైంది. విభజన ఏపీలో సీఎం గా ఉన్న బాబు కాస్తా ఇపుడు అక్కడ ప్రతిపక్ష నాయకుడు కాబోతున్నారు. ఇపుడు బాబు పరిస్థితి చూస్తే ఓ విధంగా జాలి గొలిపేదే. ఎందుకంటే 23 జిల్లాల ఉమ్మడి ఏపీకి బాబు ఒకపుడు ముఖ్యమంత్రి. ఆ తరువాత ఆయన అదే ఉమ్మడి ఏపీలో పదేళ్ళు విపక్ష నేత. మళ్ళీ అక్కడ ఎప్పటికీ సీఎం కాలేకపోయారు. ఇక 2014లో ఏపీ 13 జిల్లాలతో విడిపోయింది.ఆ విభజన ఏపీకి సీఎం అయ్యారు. అంటే అప్పటికే సగం చంద్రుడైపోయారు. నలుచెరగులా నేలను ఏలిన చంద్రబాబు సగం ముక్కకు సీఎం కావడం ఇబ్బందికరమే అని విశ్లేషణలు కూడా ఆనాడు  వచ్చాయి.


ఇపుడు ఆ ముక్క ఏపీలో కూడా అయన మాజీ ముఖ్యమంత్రి, పైగా విపక్ష నాయకుడు. అంటే పావు చంద్రుడు అన్న మాట. ఇదంతా చూసుకుంటే ఎక్కడ పూర్ణ చంద్రుడు, 23 జిల్లాల‌ ఏపీలో తిరుగులేని విధంగా  నిండు అధికారం అనుభవించిన ఆ  చంద్రబాబు ఎక్కడ. కేవలం  13 జిల్లాల ఏపీకి విపక్ష నేత  ఈ  చంద్రబాబు ఎక్కడ.  ఇది బాబు రాజకీయ పతనం కచ్చితంగా తెలియచేసే పొలిటికల్ గ్రాఫ్. 



సుదీర్ఘ అనుభవంలో బాబు సాధించిందేంటి అంటే ఉన్న చోటే పడుతూ లేస్తూ నలభయ్యేళ్ళ రాజకీయం పూర్తి చేశారనిపిస్తుంది. బాబు వయసు వాళ్ళు అయితే పెద్ద పదవుల్లోకి వెళ్ళారు. లేకపోతే గౌరవంగా ఎంపీలుగా కాలం వెళ్ళదీస్తున్నారు. బాబు మాత్రం తండ్రుల కాలం నుంచి కొడుకుల కాలం వరకూ విపక్షంలో ఉంటూ ఉన్న దర్జా కూడా  తగ్గించేసుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: