వైసీపీ అధినేత‌,  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాల ఒర‌వ‌డి కొన‌సాగుతోంది. దేశం చూపును ఏపీ వైపు తిప్పుకొనేలా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఇందుకు త‌గిన‌ట్లుగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ తాడేప‌ల్లిలో మధ్యాహ్న భోజన పథకం. అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని ఆదేశించారు.  స్కూల్స్ లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలని అన్నారు. 


ఇదే స‌మావేశంలో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని 'వైఎస్సార్‌ అక్షయ పాత్ర'గా మార్పు చేస్తూ ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వారి గౌరవ వేతనం రూ.3000కు పెంచాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహ‌కులు ఆందోళ‌న‌లో ఉండ‌వ‌ద్ద‌ని జగన్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు.. మొగ్గుచూపేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని జగన్‌ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని, సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలని స్పష్టం చేశారు.  మరోసారి సమావేశం కావాలని..అప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలంటూ అధికారులను జగన్ ఆదేశించారు .


మ‌రోవైపు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పాలనపై దృష్టిసారిస్తూనే.. తన టీమ్‌ను సిద్ధం చేసుకునే పనిలోపడ్డారు. దీనికోసం గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారులను బదిలీ చేయడంతో పాటు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని తొలగించారు. గత సర్కార్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన 42 మంది ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: