ముఖ్య‌మంత్రి హోదాలో....వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క‌మైన ప‌ద‌వి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ...ఆయ‌న పార్టీ నేత‌లు మాత్రం తీసుకునేందుకు నో అంటున్నారు. వైసీపీ అధినేత ప‌ద‌వి ఇస్తానంటే...పార్టీ నేత‌లు ఎందుకు నో చెప్తున్నారు? పైగా కీల‌క‌మైన ప‌ద‌వి అని తెలిసినా...వారు ఎందుకు దూరం ఉంటున్నారు? అనే క‌దా మీ సందేహం...ఎందుకంటే...ఆ ప‌ద‌వి తీసుకుంటే...త‌మ పొలిటిక‌ల్ కెరీర్ ఫినిష్ అనే భ‌యం ఉండ‌ట‌మే. ఇక రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పేయాల్సిందే అనే ఆందోళ‌నే కార‌ణం...ఇంత‌కీ ఆ ప‌ద‌వి ఏంటంటే..స్పీక‌ర్ ప‌ద‌వి!.


రాజకీయ, సామాజిక, జిల్లాల సమీకరణాల్లో మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితుల్లో సీనియర్‌ ఎంఎల్‌ఎలకు స్పీకర్‌, డిప్యూటి స్పీకర్‌, ప్రభుత్వ విప్‌ పదవులను పార్టీల అధిష్టానాలు ఇవ్వజూపడం ఆనవాయితీగా వస్తోంది. 1999 నుంచి నేటి వ‌ర‌కు అంటే...గడచిన రెండు దశాబ్దాల పరిణామాలను, చరిత్రను ఆకళింపు చేసుకున్న ఎంఎల్‌ఎలు తమకు స్పీకర్‌ పదవి వద్దంటే వద్దంటున్నారు. ఎందుకంటే...సెంటిమెంట్ అలా ఉంది మ‌రి. 1999లో టీడీపీ గెలుపొందగా అప్పుడు కె ప్రతిభా భారతి సుమారు నాలుగేళ్లకుపైగా స్పీకర్‌గా పని చేశారు. తదుపరి 2004 ఎన్నికల్లో ఆమె ఓటమిని చవి చూశారు. ఆ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకొచ్చింది. అప్పుడు కెఆర్‌ సురేష్‌రెడ్డి స్పీకర్‌గా పని చేశారు. అనంతరం 2009లో కాంగ్రెస్‌ సర్కారే అధికారంలోకొచ్చినప్పటికీ ఎంఎల్‌ఎగా సురేష్‌రెడ్డి ఓడిపోయారు. 2009 జూన్‌లో ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌ బాధ్యతలు చేపట్టి సుమారు ఏడాదిన్నర పాటు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం ఆయనకు సీఎం పదవి దక్కినప్పటికీ రాష్ట్ర విభజన మూలంగా కాల వ్యవధి కంటే ముందే పదవికి రాజీనామా చేశారు. 2014లో కాంగ్రెస్‌ను వీడి జైసమైక్యాంధ్ర పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. గతంలో 1994 నుంచి 1999 వరకు స్పీకర్‌గా పని చేసిన యనమల రామకృష్ణుడు 1999లో గెలిచి మంత్రి అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. దీంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 


కాంగ్రెస్‌ హయాంలో కిరణ్‌కుమారెడ్డి తర్వాత స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్‌ విభజన ఆందోళనలను ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్‌ నుంచి జనసేనలో చేరి మొన్న ఎన్నికల్లో పోటీ చేసినా అపజయం వెంటాడింది. 2014లో నవ్యాంధ్రలో స్పీకర్‌గా వ్యవ హరించిన కోడెల శివప్రసాదరావు మొన్న ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. తెలంగాణానూ స్పీకర్‌ సెంటిమెంట్‌ వదిలిపెట్టలేదు. తెలంగాణ తొలి స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి సైతం గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. గడచిన రెండు దశాబ్దాల్లో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకుంటున్న వైసీపీి సీనియర్లు స్పీకర్‌ పదవి అంటే భయపడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ జూన్‌ 8న మంత్రి మండలిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టారు. పలు సమీకరణాల నేపథ్యంలో తమకు ఆప్తులైన, ఈ పదేళ్లల్లో తన వెన్నంటే నడిచిన కొందరు సీనియర్లకు మంత్రి పదవి ఇవ్వడం కుదరకపోవడంతో స్పీకర్‌ పదవిని ఇచ్చి సంతృప్తి పర్చాలని, సేవలకు గుర్తింపునిచ్చి గౌరవించాలని జగన్‌ యోచిస్తున్నట్లు సమాచారం. జూన్‌ మూడవ వారంలో నూతన అసెంబ్లీ కొలువుదీరనున్నందున స్పీకర్‌, డిప్యూటి స్పీకర్‌ పదవులపైనా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు సీనియర్లలో ఆందోళన మొదలైంది. శాసనసభాపతి పోస్టు అత్యంత గౌరవప్రదమైనది, రాజ్యాంగ బద్ధమైనదీ అయినప్పటికీ ఆ స్థానంలో పని చేసిన వారందరూ ఘోర పరాజయం పాలయ్యారని, కొందరికైతే రాజకీయ కెరీర్‌ లేకుండా పోయిందని అందువలన స్పీకర్‌ పదవి తీసుకోడానికి అయిష్టత చూపుతున్నారని ప్రచారం జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: