కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్‌రెడ్డి తొలి రోజే ఇర‌కాటంలో  ప‌డ్డార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏకంగా పార్టీ చీఫ్‌, కేంద్ర మంత్రి అమిత్ షాతో క్లాస్ ఇప్పించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కిషన్​రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్​కు వెళ్లారు. అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.

పాకిస్తాన్​ సహా పలు దేశాలకు చెందినవారికి హైదరాబాద్​ షెల్టర్​గా మారిపోయిందని, టెర్రరిస్టు దాడులకు కుట్రలూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. టెర్రరిస్టులు హైదరాబాద్​ను వారికి సేఫ్​జోన్​గా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమంగా ఉంటున్నవారిని పంపేసి, శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి పెడతామని తెలిపారు. దీనిపై అమిత్ ఫైర‌యిన‌ట్లు స‌మాచారం.  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ సహా దేశవ్యాప్తంగా అక్రమంగా ఉంటున్న చొరబాటుదారులను పంపేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి చెప్పడం ప‌ట్ల హైదరాబాద్‌ ఎంపీ అసద్‌దుద్దీన్‌ ఒవైసీ స్పందించారు.

‘‘మంత్రి బాధ్యతలు చేపట్టకుండానే కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం. ఎన్‌ఐఏ ఎన్నిసార్లు ఈ మాటను లిఖితపూర్వకంగా చెప్పిందో వెల్లడించాలి. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ అత్యధిక సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు చేస్తోంది. ఈ నగరంతో ఆయనకు శతృత్వం ఏమిటీ? ఆయనకు హైదరాబాద్‌ ఎదగడం ఇష్టంలేదు. ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఐసిస్‌ సభ్యులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడ్డారు.. మరి అది ఉగ్రవాదుల అడ్డా అని చెప్పగలరా..? `` అంటూ మండిప‌డ్డారు. 


ఈ నేప‌థ్యంలో  అమిత్‌షా అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌షా తన డిప్యూటీని మందలించినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది.కాగా, విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: