ఔను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కొట్టిన దెబ్బ‌కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నివాసం నిండిపోయింది. అదేంటి...వైసీపీ అఖండ విజ‌యంతో తెలుగుదేశం ముఖ్యులంతా ఓట‌మి పాల‌య్యారు. ఈ క్ర‌మంలో పార్టీ క‌ళావిహీనం అయిపోయింది అంటుంటే...చంద్ర‌బాబు నివాసం నిండిపోయింది అంటున్నారేంటి? అంటున్నారా?  అక్క‌డే ఉంది అస‌లు విష‌యం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సాఆర్ సీపీ అధికారంలోకి రావడంతోనే తెలుగుదేశంకి చెందిన బినామీ సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు.  ఆ కాంట్రాక్ట‌ర్లే బాబు నివాసంలో గుమిగూడుతున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఖరారు చేశారని, చంద్రబాబు సర్కార్ బినామీలకే పనులు కట్టబెట్టారని ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించే జుడీషియల్ కమిటీ విచారిస్తుందని ఏపీ సీఎం ఈనెల 30న ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై కాంట్రాక్టర్ల కదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షిస్తామని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ ప్రకటన టీడీపీ బినామీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఎలాంటి చెల్లింపులు వద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో టీడీపీ నేతలకు దిక్కుతోచడంలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నంత పని చేశారని వారు లబోదిబోమంటున్నారు. వచ్చిన కాంట్రాక్టు పనులు రద్దు చేసుకోవాలన్నా 16-సీ ఫార్మెట్ భర్తీ చేయాలంటున్నారు. పనుల్లో జాప్యం జరిగినా? పనులు చేపట్టకపోయినా, అధికంగా కోట్ చేసినట్టు తెల్సినా 16- సీ ఫార్మెట్ ప్రకారం ఒప్పందాల కాంట్రాక్టులు రద్దవుతాయని బినామీ కాంట్రాక్టర్లర్లు ఆందోళన చెందుతున్నారు.


బినామీ కాంట్రాక్టర్ల ముందస్తుగా పనుల విలువలో 20 శాతం నిధులు మంజూరు చేయించుకున్నారని తెలిసింది. కొన్ని ప్రాజెక్టులు ప్రాధాన్యత లేకున్నా బినామీ అగ్రిమెంట్లు జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది. టీడీపీ నేతలు చెబుతున్న దాన్ని బట్టి ఏపీలో దాదాపు లక్ష కోట్లకు పైగా బినామీల అగ్రిమెంట్లు జరిగాయని తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకూ బినామీల దందా కొనసాగిందని చెబుతున్నారు. ఈ అగ్రిమెంట్లన్నీ టెండర్ల విధానంలో కాకుండా నేరుగా ప్రాజెక్టుల పనులపై అధికంగా కోట్ చేశారంటున్నారు. కాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే టీడీపీ పెద్దలు ఈ బినామీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిసింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఒప్పందాలు జరిగిపోయాయి. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం ఖాయమన్న ధీమాతో అడ్డుగోలుగా అగ్రిమెంట్లు చేసుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వంతో అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్టర్లు హైదరాబాద్‌లో మాజీ సీఎం చంద్రబాబు వద్దకు క్యూ కడుతున్నారు. తమకు కేటాయించిన పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు చెల్లుబాటు కాకుండా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని కాంట్రాక్టర్లు ఏకరువు పెడుతున్నారు. ప్రాజెక్టులపై సమీక్షలు చేసిన తర్వాత బిల్లుల చెల్లింపులపై తదుపరి ఉత్తర్వులు ఇస్తామని మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇప్పటికే తాము కొన్ని పనులు చేశామని వాటికి సంబంధించి బిల్లులు వస్తాయా? లేదా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాల వారీగా బినామీ కాంట్రాక్టర్లు దక్కించుకున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల విలువ అంచనాల్లో శ్రీకాకుళంలో తోటపల్లి, ఝంజావతి ప్రాజెక్టుల్లో కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. వీటి విలువ రూ. 3, 853 కోట్లు. అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప, హంద్రీనీవా, గాలేరు- నగరి, గండికోట ఎత్తిపోతల పథకం పనులు టీడీపీ బినామీకే దక్కాయి. వాటి విలువ రూ.9, 642 కోట్లు. కడప జిల్లాలో రూ. 10, 341 కోట్లు కర్నూల్ జిల్లాలో రూ.8, 439 కోట్లు, చిత్తూరు జిల్లాలో రూ. 8, 021 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ. 6, 834 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ.9, 451 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 10, 835 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 8, 962 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 10, 692 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 6, 942 కోట్లు, విశాఖ జిల్లాలో రూ, 6, 723 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ. 6, 201 కోట్లుకు సంబంధించిన పనులను టీడీపీ బినామీ కాంట్రాక్టర్లు దక్కించుకున్నట్టు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: