ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మెజార్టీ కుటుంబాలు స‌ర్కారీ చ‌దువుల కంటే...ప్రైవేట్ బ‌డుల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే, ప్రైవేట్‌ పాఠశాల అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఫీజులు. భారీగా ఉండే ఫీజులు ఒక్కోసారి భ‌య‌పెడుతుంటాయి. అయితే అసోంలోని ఓ పాఠశాల మాత్రం విద్యార్థుల దగ్గర స్కూల్‌ ఫీజులను తీసుకోవడం లేదు. అందుకు బదులుగా కాసిన్ని ప్టాస్టిక్‌ వ్యర్థాలను ఇస్తే చాలని చెబుతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా... ఇది మాత్రం నిజం.  అసోంలోని పమోహీలోగల ‘అక్షర ’ పాఠశాల పేరుకు ప్రైవేటు పాఠశాల అయినప్పటికీ ఇక్కడ ఫీజు వసూలు చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఈ పాఠశాలలో ఫీజు కట్టాలంటే నోట్ల కట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫీజుల రూపంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వ్యర్థాలు తీసుకుంటారు. 


ఈశాన్య రాష్ట్రమైన అసోంలో చలి ఎక్కువ. దీంతో చలిమంటల కోసం అక్కడి ప్రజలు ప్లాస్టిక్‌ వ్యర్థాలనే ఉపయోగిస్తారు. నిజానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇలా బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. ప్లాస్టిక్‌ తగులపెట్టడం వల్ల వెలువడే విషవాయువులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్పభ్రావాన్ని చూపుతున్నాయి. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మిత శర్మకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే న్యూయార్క్‌లో ఓ స్కూల్‌ ప్రాజెక్టు చేస్తున్న మజిన్‌తో తన ఆలోచనను పంచుకుంది. టీఐఎస్‌ఎస్‌ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌)లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన పర్మిత... అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్‌కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర’ విద్యాలయం.


ఈ స్కూల్లో చదివే చిన్నారులు ఉదయాన్నే పుస్తకాలతోపాటు ఇరుగుపొరుగువారి ఇళ్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్ కి తీసుకువెళతారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావాలని విద్యార్థులను కొన్ని నెలల నుంచి కోరుతున్నామనీ..దీనికి ప్రతిగా విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మజిన్ ముఖ్తార్ తెలిపారు. విద్యార్థులు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇక్కడే రీ సైక్లింగ్ చేస్తున్నామని తెలిపారు. పేదల పిల్లలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పిస్తూనే..ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించమని చెబుతున్నామన్నారు. ఇలా వారికి అవగాహనతో పాటు పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నామన్నారు. అంతేకాదు వారికి ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించిన చిన్నారులకు ‘టాయ్ మనీ’ అందిస్తున్నారు. దీంతో వారి అవసరాలు తీరటంతో పాటు వారు చక్కగా చదువుకునేందుకు తోడ్పడుతుందన్నారు. ఈ పాఠశాలలో 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ప్ర‌స్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పుడమితల్లి అల్లాడిపోతోంది. ఒక పాలిథిన్ కవర్ భూమిలో కలవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది లెక్కలేనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి అత్యంత భారంగా మారుతోంది. మూగ జీవాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్ ని నిషేధించాలని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ప్లాస్టిక్ నిషేధం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ వినియోగం ఇలాగే పెరిగితే భూగోళానికి ప్రమాదం తప్పదు..మనిషి మనుగడ ప్రశ్నార్థంకాక మానదు..భూమిపై నివసించే జీవరాశులు అంతరించిపోక తప్పదు..ఈ ప్రమాదాలన్నింటికీ మనిషే కారణంగా మారుతున్నాడు. దానిని అరిక‌ట్టేందుకు చిన‌న త‌నం నుంచే విద్యార్థుల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చేస్తున్న వీరి ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: