చూస్తుంటే చంద్రబాబునాయుడుకు  అనంతపురం టిడిపి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చేట్లున్నారు. టిడిపిని వీడి అవకాశం ఉంటే వైసిపికో లేకపోతే బిజెపిలోనో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లే కనబడుతోంది. తాజాగా జేసి మాటలు విన్న వారికి అందరికీ అవే అనుమానాలు వస్తున్నాయి.

 

తాజాగా జేసి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావాడే అన్నారు. మొన్నటి వరకూ జగన్ అంటేనే పూనకం వచ్చినట్లుగా ఊగిపోతు జేసి సోదరులు వ్యక్తిగతంగా అమ్మనాబూతులు తిట్టిన సంగతి అందరూ చూసిందే.  చంద్రబాబు మెప్పుకోసం  బహిరంగ సభల్లో  జగన్ ఎన్ని తిట్లు తిట్టింది అందరికీ తెలిసిందే. అలాంటిది జగన్ ను తాను ఎప్పుడూ ద్వేషించలేదని నిసిగ్గుగా  చెప్పుకున్నారు.

 

జగన్ మంచి ముఖ్యమంత్రిగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పటం విచిత్రంగా ఉంది. జేసి మాటలు చూస్తుంటే టిడిపిలో ఉంటే తమ వారసులకు రాజకీయ భవిష్యత్తు లేదని అర్ధమైపోయినట్లుంది.  అందుకనే పక్క చూపులు చూస్తున్నారు. పైగా తనతో పాటు జానారెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటానని రచ్చబండ కార్యక్రమంలోకి వెళ్ళేముందు వైఎస్ హామీ ఇచ్చినట్లు అసందర్భంగా ప్రస్తావన తెచ్చారు. దురదృష్టవశాత్తు వైఎస్ మరణంతో ఆ హామీ అలాగే పోయిందని ఇపుడు చెబుతున్నారు.

 

సరే మొత్తం మీద రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లుగా జేసి ప్రకటించేశారు. మొన్నటి ఎన్నికల్లోనే జేసి సోదరులు రాజకీయాల్లో పోటి చేయలేదన్న విషయం తెలిసిందే. పోటీ చేసిన ఇద్దరు వారసులు కూడా ఓడిపోయారు. వైసిపిలో కానీ బిజెపిలో కానీ చేరుతారా అన్న ప్రశ్నకు జేసి చూద్దాం అంటూ సమాధానం దాటవేయటంలోనే జేసి ఆలోచనలేంటో అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: