ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన అధికార టీడీపీకి ఇప్పుడు వ‌రుస‌పెట్టి షాకులు త‌గ‌ల‌నున్నాయి. ఆ పార్టీకి వ‌చ్చే ఐదేళ్ల‌లో  ఏ మేర‌కు భ‌విష్య‌త్తు  ఉంటుందో ? అన్న సందేహాలు ఆ పార్టీలోనే చాలా మంది నేత‌ల‌కు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ఆ పార్టీలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా ఉంటోన్న సీనియ‌ర్ నేత‌లు అంద‌రూ త‌మ దారి తాము చూసుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇక కొంద‌రు నేత‌లు త‌మ‌పై ఉన్న కేసుల నేపథ్యంలో క‌మ‌లం వైపు చూస్తున్నార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


ఇక ఇప్పుడు పార్టీ నుంచి గెలిచిన కొద్ది మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నిలుపుకోవ‌డం కూడా టీడీపీకి క‌ష్ట‌మ‌య్యేలా ఉంది. ఇందుకు ఆ పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విబేధాలు కూడా కొంత వ‌ర‌కు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. తాజాగా విజ‌య‌వాడ‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇఫ్తార్ విందుకు వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మం మొత్తం మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. దీంతో దేవినేని ఉమాతో ఆది నుంచి రాజ‌కీయ వైరం ఉన్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఈ కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టేశారు.


ఆయ‌న రెండు రోజుల ముందే ఢిల్లీకి చెక్కేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే నాని ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్ద‌ల‌తోనే ఎక్కువుగా ట‌చ్‌లో ఉంటున్నార‌ట‌. నితిన్ గ‌డ్క‌రీతో నాని ఎక్కువుగా ట‌చ్‌లో ఉంటున్నారు. ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే బీజేపీ వాళ్ల‌ను క‌లుస్తున్నాన‌ని చెప్పినా... స్థానికంగా టీడీపీకి చెందిన ఉమాతో ఉన్న వైరం... టీడీపీలో ఐదేళ్ల పాటు ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని నానికి అర్థం కావ‌డంతో ఆయ‌న బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. 


ఇదిలా ఉంటే గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచే టీడీపీ అధిష్టానం కూడా నానిని ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌య‌త్నించింది. అస‌లు ఒకానొక ద‌శ‌లో నానికి ఎంపీ సీటు తిరిగి ద‌క్కుతుందా ? అన్న సందేహాలు కూడా వ‌చ్చాయి. టీడీపీకి ఎన్నిక‌ల‌కు ముందు విజ‌య‌వాడ గ్యారెంటీ గెలుపు సీటు కావ‌డంతో ఇక్క‌డ చంద్ర‌బాబు త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిని ఎవరిని అయినా నిల‌బెడ‌దామ‌ని కూడా చూశారు. ఇక తాజాగా ఫ‌లితాల త‌ర్వాత టీడీపీలో పార్ల‌మెంటుకు సంబంధించిన ప‌ద‌వుల పందేరం జ‌రిగింది. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఇద్ద‌రికి మాత్ర‌మే చంద్ర‌బాబు ప‌ద‌వులు ఇచ్చి నానిని ప‌క్క‌న పెట్టారు.


రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల తరపున టీడీపీపీ అధ్యక్షునిగా గల్లా జయదేవ్‌కు చంద్రబాబు బాధ్యతలు ఇచ్చారు. లోక్‌సభా పక్ష నేతగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. దీంతో నాని స‌హ‌జంగానే అసంతృప్తికి గురైన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు నానిపై బీజేపీ అధినాయ‌క‌త్వం కూడా గురి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా నాని ఎలాంటి షాకింగ్ డెసిష‌న్ అయినా తీసుకునే ఛాన్సులు ఉన్నాయ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: