నకిలీ పత్రాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలంద మీడియా ఫిర్యాదుతో ఊహించ‌ని రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చిన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ సైబరాబాద్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయిన సంగ‌తి తెలిసిందే. రవిప్రకాశ్‌పై ఫిర్యాదు చేయగా..సైబరాబాద్‌ పోలీసులు రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద సైబరాబాద్‌ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్‌కు నోటీసులు జారీచేసినా..విచారణకు హాజరుకాలేదు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో..ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రవిప్రకాశ్‌కు ఉపశమనం కల్పించలేమన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల‌తో ర‌విప్ర‌కాశ్ పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ విచార‌ణ గురించి ఆయ‌న సంచ‌ల‌న విష‌యాలు పంచుకున్నారు.


టీవీ9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుకున్నారని ర‌విప్ర‌కాశ్‌ ఆరోపించారు. ``నాపై దొంగ కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నన్ను అక్రమంగా టివి9 నుంచి బయటికి పంపించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాను. ఇది మాఫియాకు మీడియాకు జరుగుతున్న ధర్మ యుద్ధం. ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుంది`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు.


కాగా, రవిప్రకాశ్‌ సైబరాబాద్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరవ‌గా...ఈ కేసులో రవిప్రకాశ్‌తోపాటు సినీ నటుడు శివాజీకి సైబర్‌ క్రైం పోలీసులు గతంలో లుక్‌ ఔట్‌ సర్యులర్‌ కూడా జారీచేశారు. అయితే తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని..విచారణకు హాజరుకాలేమని రవిప్రకాశ్‌, శివాజీ సైబర్‌ క్రైం పోలీసులకు తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: