తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇప్ప‌టికే 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేర‌గా..తాజాగా మ‌రో ఎమ్మెల్యే పార్టీ వీడ‌టం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.


వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు,తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి సైతం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న పార్టీ మార్పుపై గ‌త వారం రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి పైల‌ట్ అత్యంత స‌న్నిహితుడు అయినందున ఈయ‌న పార్టీ మార్పుపై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని పార్టీ పెద్ద‌లంతా ఖండించారు.కానీ, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానం మేర‌కు పైల‌ట్ రోహిత్ రెడ్డి గులాబీ కండ‌వా క‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌న నాలుగు రోజుల క్రిత‌మే టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి ఉంద‌ట‌.కానీ, ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఈ చేరిక‌ ఆల‌స్య‌మైంద‌ట‌. ఇక ఫ‌లితాలు ముగిసిన నేప‌థ్యంలో ఆయన అధికారికంగా నేడు కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ కండ‌వా క‌ప్పుకోవ‌డం జ‌రిగింది.


అన్నీ కుదిరితే ఇవాళే సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీలో చేరాల‌నుకున్నార‌ట‌. కానీ, ఆఖ‌రి నిమిషంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.అయితే, ఇంత హ‌డావుడిగా పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ మార‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇందుకోసం ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 11 మందిని లాగేసింది. తాజాగా పైలెట్ చేరిక‌తో ఆ సంఖ్య 12కు చేరింది.మ‌రోవైపు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసినందున కాంగ్రెస్ నుండి గెలుపొందిన వారి సంఖ్య 18కి త‌గ్గింది. అయితే, కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 12 మంది. తాజాగా పైల‌ట్ చేరిక‌తో ఆ సంఖ్య స‌రిపోయింది.ఇక‌.. త్వ‌ర‌లోనే సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.


అయితే..పైలెట్ రోహిత్ రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు.అలాంటి వ్య‌క్తి పార్టీ మారడంపై ప‌లువురు ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.కానీ, రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎలాగు కొండా చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఇక ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తే ఆగ‌మ్య‌గోచరంగా త‌యారైంది.ఇక అలాంట‌ప్పుడు ఆయ‌న అనుచ‌రులు పార్టీలో ఉంటే ఎంతా,పోతే ఎంతా అనేలా ప‌రిస్థితులు మారిపోయాయి.


ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెలుసుకోవాల్సి ఉంది.. అదేమంటే.. పైల‌ట్ రోహిత్ రెడ్డికి మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటుంది. వారిద్ద‌రి మ‌ధ్య వివాదాలు ఈనాటివి కావు. తాండూరు టీఆర్ఎస్ టికెట్ ను 2014లోనే పైలెట్ రోహిత్ రెడ్డికి ఇవ్వాల్సి ఉండే. కానీ, టీడీపీ నుంచి వ‌చ్చిన మ‌హేంద‌ర్ రెడ్డి సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌డం ,సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయినందున ఆయ‌న వైపే పార్టీ మొగ్గుచూపింది. పైలట్ కు ఎమ్మెల్సీ గానీ,లేదంటే ఇత‌ర‌త్రా ఏదైనా ప‌ద‌వి ఇచ్చి ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చింది. కానీ, పైల‌ట్ రోహిత్ రెడ్డిని పూర్తిగా అణ‌గ‌తొక్కేందుకు మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నించ‌డంతో యంగ్ లీడ‌ర్స్ అనే సంస్థ‌ను స్థాపించి.. యువ‌త‌లో అనునిత్యం ఉత్సాహం నింపుతూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించాడు పైల‌ట్. ఇక 2018 ఎన్నిక‌ల్లో పైల‌ట్ ఎక్క‌డ అడ్డు వ‌స్తాడోన‌ని ముందే గ్ర‌హించిన మ‌హేంద‌ర్ రెడ్డి పైల‌ట్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయించాడు. దీంతో..మ‌రింత క‌సితో ముందుకెళ్లిన పైల‌ట్..ఏ పార్టీతో సంబంధం లేకుండా త‌న యంగ్ లీడర్స్ సంస్థ ద్వారా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ప్ర‌జ‌ల్లో మంచి పేరు సంపాదించాడు.


దీంతో.. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పిలిచి మ‌రీ పైల‌ట్ కు టికెట్ ఇచ్చింది. ఇక తాండూరులో ఓట‌మి అనే ప‌దం తెలియ‌కుండా విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్న మ‌హేంద‌ర్ రెడ్డిని మ‌ట్టిక‌రిపించి హ‌స్తం గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచాడు పైల‌ట్.


వాస్త‌వానికి త‌న‌ను ఎమ్మెల్యేను చేసిన కాంగ్రెస్ పార్టీని ఎప్ప‌టికీ వీడ‌కూడ‌ద‌ని అనుకున్నాడు పైల‌ట్ రోహిత్ రెడ్డి.కానీ, రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోతున్న పార్టీలో ఎంత కాలం ఉన్నా రాజ‌కీయంగా ఎత్తుకు ఎద‌గ‌లేమ‌ని భావించి.. ఆయ‌న కూడా కారెక్కుందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి పైల‌ట్ రోహిత్ రెడ్డి పార్టీ మార‌డం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌నే చెప్పాలి.ఈ చేరిక‌లు పైల‌ట్ తో మాత్ర‌మే ఆగిపోయేలా క‌నిపించ‌డం లేదు. త్వ‌ర‌లోనే మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు(పోడెం వీర‌య్య‌,సీత‌క్క‌,జ‌గ్గారెడ్డి)కూడా జంప‌య్యే ఆలోచ‌నలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక వీరు కూడా నిజంగానే పార్టీని వీడితో కాంగ్రెస్ లో మిగిలేది ఇంకా(భ‌ట్టి విక్ర‌మార్క‌,శ్రీధ‌ర్ రెడ్డి,కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి) ముగ్గురే…


ఒక్కొక్క‌రుగా పార్టీ వీడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చూస్తూ కూర్చోవ‌డంపై స్వంత పార్టీ కార్య‌క‌ర్త‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ లో ఉత్త‌మ్ మాత్ర‌మే మిగులుతారా అన్న సందేహం క‌లుగుతోంది. ఇప్ప‌టికైనా పార్టీ మారే వారికి అడ్డుక‌ట్ట వేసి..పార్టీని కిందిస్థాయి నుంచి బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం బెట‌ర్..లేదంటే తెలంగాణ‌లో క‌మ్యూనిస్టు పార్టీలు ఎలాగైతే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయో..కాంగ్రెస్ పార్టీకి అదేగ‌తి ప‌ట్ట‌డం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: