పరిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో త‌ల‌బొప్పి క‌ట్టిన కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్‌లో చేరారు. ఉదయం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆయన ప్రగతి భవన్లో కలిశారు. తాండూర్ నియోజకవర్గ  అభివృద్ధి గురించి చర్చించి.. ఆ తర్వాత టీఆర్ఎస్ చేరడంపై చర్చించారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో చర్చించి.. అతి త్వరలోనే టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారికంగా చేరాలని నిర్ణ‌యించుకున్నారు. 


టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు క్యూ కడుతూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జోరుగా వలసలు కొనసాగినా.. ఆ తర్వాత కొంత కాలం ఆగిపోయింది. అయితే, తాజాగా, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బె చెప్పడం చ‌ర్చ‌నీయాంశంగా  మారింది. ఆయనతో టీఆర్ఎస్ అగ్రనేతలు మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌య్యారు. 


ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. మరోవైపు మరో ఒక్కరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కారెక్కుతారని తెలుస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్యతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ గూటికి చేరుతారనే చర్చ సాగుతోంది. దీంతో మరో ముగ్గురు కారెక్కితే.. మిగిలేది ముగ్గురు, నలుగురేనా? అని అనుమానాలు కలుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్ర‌ణాళిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ కుదేలు అవుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: