ఎంత కాదనుకున్నా మనది కులస్వామ్యం. ప్రజాస్వామ్యంలో కూడా ఎవరూ కులాలను వదలడంలేదు. ఆ మాటకు వస్తే కులాన్ని చూసి ఓటేయడం మనవారు జన్మ హక్కులా భావిస్తారు. ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కులం పేరు చెప్పుకుని ఎన్నికల్లో టికెట్లు, పదవులు, రిజర్వేషన్లు ఇలా చాలా జరుగుతున్నాయి.


 విషయానికి వస్తే ఏపీలో ప్రధాన సామాజిక వర్గంగా గత నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో కమ్మ వారు ఉంటున్నారు. అన్న నందమూరి రాజకీయాల్లోకి రాకముందు కాంగ్రెస్ పాలనలో రెడ్ల తరువాత స్థానంలో ఉండేవారు. స్వాతంత్రం వచ్చిన 34 ఏళ్ల తరువాత కానీ ముఖ్యమంత్రి పదవి కమ్మలను వరించలేదు. దానికి కారణం జనాభా తక్కువ ఉండడంతో పాటు, జనాల వద్దకు రీచ్ అయ్యే నాయకత్వం, గ్లామర్ ఫేస్ లేకపోవడం. ఎంతో మంది కమ్మవారు గొప్పవారు ఉన్నా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోలేకపోవడానికి రెడ్ల డామినేషన్ మరో కారణం.


ఇక టీడీపీ ఏర్పడిని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్నది బయటకు చెప్పుకున్న రెడ్ల పాలన నుంచి తమను తాము విముక్తం చేసుకోవడానికి కమ్మలు అలా ఓ ముందడుగు వేశారని చెప్పాలి. అంతకు ముందు వామపక్షాలలో ఉన్న కమ్మలు కాంగ్రెస్ కి ప్రత్యామ్న్యాయంగా  ఉన్నా అధికారం పొందే స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు. ఇవన్నీ కలసి కసిగా కమ్మలకు ఓ పార్టీ అంటూ టీడీపీ ఏర్పాటైంది. ఆ తరువాత కమ్మలెంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్రమంత్రులు అయ్యారు. 


టీడీపీ ఓటమి పాలు అయినా మళ్ళీ గెలిచే పరిస్థితి అప్పట్లో ఉండేది కాబట్టి కమ్మలకు ఏ బెంగా లేకుండా పోయింది. మరో వైపు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండడంలో అందులో కొంతమంది కమ్మ నాయకులు చేదోడు వాదోడు కూడా ఉండేది. ఈ నలభయ్యేళ్ళ ప్రస్తానంలో టీడీపీ ఆటుపోట్లకు గురైనా  ఓ వైపు బలమైన మీడియా సహకారం, మరో వైపు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలొలో ఆ సామాజికవర్గం నాయకుల అండ ఉంటూండేది. ఇపుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.


ఆ పార్టీతో తగవు పెట్టుకున్న కారణంగా కమ్మలకు తలాక్ అనేశారు కమలనాధులు. అంతకు ముందే ముఖ్యనాయకుడిగా ఉన్న ఓ పెద్దాయన్ని కీలకమైన పదవిలోకి కూర్చోబెట్టి క్రియాశీల రాజకీయాలకు దూరం చేశారు. ఇలా సూత్రధారులు అక్కడ తెగిపోయారు. ఇక్కడ చూస్తే తెలంగాణాలో వెలమలు అధికారంలోకి వచ్చారు. ఏపీలో రెడ్లు పుంజుకుని అధికారం కైవశం చేసుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే రాజకీయంగా ఎన్నడూ లేనంత దుర్బర పరిస్థితి కమ్మలకు దాపురించిందని అంటున్నారు. 


ఇక మీడియా సహకారం విషయానికి వస్తే గతంలోలా పరిస్థితులు లేవు. సోషల్ మీడియా జోరు పెరిగింది. దాంతో శాసించే వాతావరణం లేదు. ఇంకో వైపు కమ్మ సామాజికవర్గం చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఇపుడు రెడ్లు కూడా చేస్తున్నారు. బీసీలు, కాపులు, ఇతర వర్గాల మద్దతుతో తాజా ఎన్నికల్లో వైసీపీ  అధికారంలోకి రావడం అందులో భాగమే. కమ్మలకు టీడీపీ ఒక్కటే అవకాశంగా  ఉంది. ఆ పార్టీలో నాయకత్వ  సంక్షోభం  ఇపుడు ఎక్కువగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి  ఆ పార్టీ బయటపడితేనే కమ్మలకు కూడా రాజకీయ పునవారాసం లభిస్తుందని చెప్పాలి. మొత్తానికి పరిస్థితి ఎలా ఉందంటే 1983 ముందు నాటిలా ఉందని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: