ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు...25 మందితో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడాలేని విధంగా తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపులకు.. ఇలా ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలని జగన్ భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. 


అయితే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియ‌మించ‌బోయే ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎవరు? ఏ సామాజికవర్గం నుంచి ఎవరు? ఎవరు డిప్యూటీ సీఎంల రేస్‌లో ఉన్నారు? అనే ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం, ఐదుగురు నేత‌ల పేరును జ‌గ‌న్ ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాపు కోటాలో ఆళ్ల నాని, మైనార్టీ కోటాలో అంజాద్ బాషా, ఎస్సీ కోటాలో సుచరిత,  ఎస్టీ కోటాలో రాజన్నదొర, యాదవ కోటాలో పార్థసారథికి చాన్స్ ద‌క్క‌డం ఖాయ‌మైంద‌ని తెలుస్తోంది. 


తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ, మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, SC,ST,BC, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాదు రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోందన్న సీఎం జగన్ ..సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: