ఎన్నికలైపోయాయి. ఫలితాలొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై అప్పుడే వారం పైనే అయిపోయింది.  ప్రస్తుతం గద్దెనెక్కిన సర్కార్ వారంపాటు ఏం చేసిందయ్యా అంటే పాత ప్రభుత్వం మురికిని కడిగే ప్రయత్నం చేసింది.  నాటి ప్రభుత్వ అధికారుల తోపాటు అధికారిక ప్రక్రియలను సైతం పూర్తిగా ప్రక్షాళన చేసింది.  మామూలుగా మనం కొత్త ఇంట్లో చేరితేనే పరిశుభ్రం చేసుకుంటాం అలాంటిది ప్రజలను పాలించే అత్యున్నత వ్యవస్థను నడపాల్సినపుడు మరింత జాగ్రత్తగా వుంటారు.  కాని ప్రస్తుత ప్రభుత్యం పరిశుద్ధ ప్రక్షాళణ పేరుతో ఆర్ధికంగా రాష్ట్రానికి మరింత భారాన్ని చేకూర్చే ప్రయత్నం చేస్తున్నదని కొంతమంది అభిప్రాయం.

 ఇప్పటిదాకా గత ప్రభుత్వం చేసిన పనులన్నీ దాదాపుగా పూర్తిగా ఆపివేయడం జరిగింది.  ఇంకా చెప్పాలంటే ఇప్పటిదాకా కోట్లు పెట్టి చేపట్టిన కార్యక్రమాలన్నీ ‘తూఛ్ ఇదంతా అవినీతిమయం’ మళ్ళీ మొదలుపెట్టాలని చాలా శాఖలకు ఆదేశాలు యుద్ధప్రాతిపదికన వెళ్ళిపోయాయి.  అసలే లోటు బడ్జెట్, ఆపై అప్పులభారం... ఇప్పుడు జరిగిన వేల కోట్లలో జరిగిన పనులు ఆపి తిరిగి ప్రారంభించాలంటే ఎంత డబ్బు అవసరమో పాలకవర్గానికి అంచనా వుందా... ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ప్రభుత్వం నడవడానికి సరైన నగదు ఆసరా లేదన్నది అక్షరసత్యం.  కాదు జరుగుతున్న పనులన్నీ అవినీతితో నిండిపోయాయన్న వాదన వున్నా, అవన్నీ ప్రస్తుత పరిస్థితిలో తిరిగి ప్రారంభించే స్థితిలో ప్రభుత్వం వుందా.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లా కాకుండా దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకీ ఇద్దరికీ శ్రేయస్కరం.

డబ్బు వున్నపుడు ఆలోచనల ఆచరణకు అంతుండదు. అదే డబ్బు లేనప్పుడు ఆలోచనలకు హద్దు ఆచరణకు సరిహద్దు చాలా అవసరం.  కత్తి వుందని కదనరంగంలో ప్రతి వాడూ వీరుడైపోడు. కత్తి వాడే విధానంలో వీరుడు, అలాగే పరిపాలించే విధానంలో పాలకులు చరిత్రకెక్కుతారు.  ప్రతీదీ రెడ్డొచ్చె....మొదలెట్టే పరిస్థితి అయితే అవడానికి పెళ్ళి, పాలించడానికి రాజ్యం రెండూ ఎప్పటికీ అవ్వవు. వినడానికి కాస్త ఘాటుగా వున్నా భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని, ప్రస్తుత పరిస్థితిని నేటి ప్రభుత్వం అర్ధం చేసుకొని ఆచితూచి అచరణ కొనసాగిస్తే వేసే ప్రతి అడుగు ఆంధ్రడి భవిష్యత్తు అవుతుంది లేదంటే అంధుడి బాట అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: