ఏపీ నవయువ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. నాన్చుడు ధోరణి లేదు. ఎటువంటి నిర్ణయమైనా సింగిల్ మీటింగ్ లో సెటిల్. మాటలు లేవు. కేవలం చేతల పని మాత్రమే. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం. ఇది ఇప్పుడు జగన్ పని తీరు. నేను మాటల సీఎం కాదు చేతల సీఎం అని నిరూపించుకుంటున్నారు. విపక్ష నేతగా ఐదేళ్ల పాటు కొనసాగిన జగన్... ఎక్కడికెళ్లినా సుదీర్ఘ ప్రసంగాలు చేసేవారు.


ఓ విపక్ష నేతగా ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టేందుకు ఇలాంటి సుదీర్ఘ ప్రసంగాలు సర్వ సాధారణమే. అయితే ఆ తరహా సుదీర్ఘ ప్రసంగాలు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అధికారం చేతికందింది. ఇక చేతల్లో తన పనితీరును చూపించాల్సిందేనని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ తరహా కొత్త మార్పునకు జగన్ పెద్డగా సమయం తీసుకోలేదనే చెప్పాలి. నేటి ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీఎల్పీ సమావేశంలో జగన్ కీలక ప్రసంగం చేశారు.


అయితే ఈ ప్రసంగం కేవలం 12 నిమిషాల పాటే సాగింది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేసిన జగన్... తన ప్రసంగాన్ని 12 నిమిషాల్లో ముగించేశారు. ఈ 12 నిమిషాల ప్రసంగంలోనే జగన్ కీలక నిర్ణయాలన్నింటినీ ప్రకటించేశారు. తన కేబినెట్ లో 25 మందికి స్థానం - వారిలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులు - ఆ పోస్టులన్నీ కూడా ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ - కాపు సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. తన కేబినెట్ లోని మంత్రి పదవుల్లో సగానికి సగం బడుగు బలహీన వర్గాలకేనని ప్రకటించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: