ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రికొద్ది గంటల్లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో...విజయవాడకు గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు.  ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయ‌న్ను క‌లుసుకున్నారు. శ‌నివారం ఏపీలో మంత్రివర్గ సభ్యుల ప్రమాణంపై చర్చించారు. మంత్రివర్గ జాబితాను గవర్నర్ కు అందజేశారు. అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ లో మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై గవర్నర్, సీఎం చ‌ర్చించారు.  


ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు.. 20 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి రేపు సచివాలయంలో తొలిసారి అడుగుపెట్టనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన ఫైల్స్‌పై సంతకాలు చేస్తారు. తదనంతరం కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం.. ఆ తర్వాత సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. 


ఇదిలాఉండ‌గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో.. మంత్రులు కాబోయేవారికి విజయసాయిరెడ్డి ఫోన్లు చేస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో... సాయిరెడ్డి, సీఎం జగన్ కార్యాలయం నుంచి నేతలకు ఫోన్లు వెళ్తున్నాయి.  25 మందితో కూడిన కేబినెట్ ఫైనల్ కాగా... కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి, సుచరితకు ఫోన్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: