వైసీపీ అధినేత‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీల‌క‌మైన కేబినెట్ కూర్పు పూర్తి చేశారు.  తొలిసారిగా ఐదుగురికి ఉప‌ముఖ్య‌మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు పార్టీ స‌మావేశంలో ప్ర‌క‌టించి జ‌గ‌న్ సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.  అనంత‌రం కేబినెట్ మంత్రులు పేర్లు క‌స‌ర‌త్తు చేసి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌కు ఈ మేర‌కు జాబితా అంద‌జేశారు.

శుక్రవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశమై పేర్ల వివ‌రాలు అందించారు. అయితే, జ‌గ‌న్ అందించిన జాబితాలో ప‌లు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. జ‌గ‌న్ కేబినెట్లో ముగ్గురు నానిలు ఉండ‌టం విశేషంగా చెప్తున్నారు. జగన్ మంత్రివర్గంలో ముగ్గురు  "నాని``లు ఉండ‌టాన్ని ప‌లువురు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తున్నారు. కొడాలి నాని, ఆళ్ల నాని,  పేర్ని నానికి జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించార‌ని చెప్తున్నారు.

కొడాలి నాని గుడివాడ నుంచి గెలుపొంద‌గా, పేర్ని నాని మచిలీపట్నం నుంచి విజ‌య‌సాధించారు. ఇక ఆళ్లనాని  ఏలూరు నుంచి జ‌య‌కేతనం ఎగురవేశారు. ఇలా ముగ్గురు నానిల‌కు జ‌గ‌న్ త‌న కేబినెట్లో చోటు క‌ల్పించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు.


ఇదిలాఉండ‌గా, కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు జ‌గ‌న్‌ చోటు కల్పించారు. మంత్రి వర్గంలో ఒక ముస్లిం సహా ఎనిమిది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి వర్గీయులు, ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు చోటు కల్పించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: