ఏపీ ముఖ్యమత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివ‌ర్గ కూర్పు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. వివిధ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకీ  తీసుకొని ఎంతో ప‌రిణ‌తితో జ‌గ‌న్  తన క్యాబినెట్‌లో గోదావరి జిల్లాలకు ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. ఒకవిధంగా చెప్పాలంటే పదవుల వరద పారించారు. ఉప ముఖ్యమంత్రి సహా ఆరు మంత్రి పదవులు కట్టబెట్టారు. త‌ద్వారా త‌న‌కూ గోదావ‌రి జిల్లాలంటే మ‌క్కువ ఉంద‌ని జ‌గ‌న్ నిరూపించుకున్నార‌ని అంటున్నారు. 


రాష్ట్ర విభజన అనంతరం ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల ఫలితాలు అత్యంత కీలకంగా మారిన సంగతి విదితమే. తాజా సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాలకు గాను 14, పశ్చిమ గోదావరి జిల్లాలో 15స్థానాలకు గాను 13 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లభిస్తుందని అంతా భావించారు. ఊహించిన విధంగానే జ‌గ‌న్ ఈ జిల్లాల‌కు పెద్ద పీట వేశారు. 


తూర్పు గోదావరి జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోసు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కురసాల కన్నబాబు, అమలారపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పినిపే విశ్వరూప్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), ఆచంట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనితకు మంత్రివర్గంలో స్థానం లభించింది. వీరిలో ఏలూరు నుండి ఎన్నికైన ఆళ్ల నానికి ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా ఐదు ఉప ముఖ్యమంత్రుల్లో కాపుల కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: