ఎన్నికల్లో ఘోర ప‌రాభ‌వం నేప‌థ్యం ఒక‌వైపు...తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్తు మృగ్య‌మైన సూచ‌న‌లు మ‌రోవైపు క‌నిపిస్తున్న నేప‌థ్యంలో....టీడీపీ నేత‌ల్లో ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల దోర‌ణి పెరిగిపోతోంది. తాజా ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితుడు అయిన మాజీ ఎంపీ సీఎం రమేష్‌నాయుడుపై తెలుగుదేశం నేత తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  టీడీపీ హయాంలో సీఎం ర‌మేష్‌ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించాడని తెలుగుదేశం పార్టీ నాయకుడు వరదరాజులరెడ్డి ఆరోపించారు. సీఎం రమేష్ అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.


కడప జిల్లా ప్రొద్దుటూరులో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో అన్నిపనులు దక్కించుకున్న రమేష్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు రూ.4 వేల కోట్ల మేరకు అక్రమంగా సంపాదించాడన్నారు. దేశంలోనే అవినీతిపరుడుగా నిలిచిన రమేష్‌నాయుడుపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు.టీడీపీ ప్రభుత్వం హయాంలో నామినేట్ టెండర్ల ద్వారా రూ.4 వేల కోట్ల పనులు సొంతం చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పనులు జరిగినా తనకే దక్కేలా పైరవీలు సాగించారన్నారు. గాలేరు, హంద్రీనీవా, రోడ్ల పనులను రమేష్ దక్కించుకుని భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి భారీ ముడుపులు తీసుకునేవాడన్నారు. పంచాయతిరాజ్, ఆర్‌అండ్‌బి ఇంజనీర్లు, అధికారులను బెదిరించి పనులు సొంతం చేసుకునేవాడన్నారు. సీఎం పేషీలో ఉన్న వారితో ఫోన్లు చేయించి కాంట్రాక్టులు దక్కించుకునేవారన్నారు. రమేష్ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే అతని బండారం బయటపడుతుందన్నారు. అవినీతిరహిత పాలన సాగిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ సీఎం రమేష్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని వరదరాజులరెడ్డి డిమాండ్ చేశారు.


కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్య‌క్తే...తెలుగుదేశం పార్టీ ఎంపీపై భారీ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం...దేశంలోనే అత్యంత అవినీతిప‌రుడ‌నే ముద్ర‌వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  మ‌రోవైపు అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను విచార‌ణ చేయాల‌ని కోర‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: