ఔను. ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఫాలో అవ్వాల‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత‌లు డిసైడ‌యిపోయారు. అత్యంత ఆస‌క్తిక‌రంగా...వైఎస్ జ‌గ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు....ఇర‌కాటంలో ప‌డేసేందుకు..టీ కాంగ్రెస్ ఇలా జ‌గ‌న్ ఫార్ములాను కాపీ కొట్టేస్తోంది! త్వ‌ర‌లో దాన్ని అమ‌లు చేయ‌నుంది. విన‌డానికి ఆస‌క్తిగానే కాకుండా ఒకింత‌ చిత్రంగా ఉండ‌వ‌చ్చు కానీ...ఇది నిజంగా నిజం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఎదుర‌వుతున్న షాకుల ప‌రంపర‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు నేత‌లు.


రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాకులు త‌గులుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత విష‌యానికే వ‌స్తే...ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. స్థానిక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ అదే ఒర‌వ‌డి. దీనికి కొన‌సాగింపుగా తాజాగా...కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మూక్ముడిగా కారెక్కడం పార్టీ నేత‌ల‌ను షాక్‌కు గురిచేసింది. అధికార టీఆర్‌ఎస్‌ పట్ల దూకుడుగా వ్యవహరించకుండా... నిలకడగా, నిమ్మలంగా ఉండటం వల్లే కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్ధితి వచ్చిందని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోని కీలకమైన నేతలు అధికార పార్టీ అడుగులకు ముడుగులు ఒత్తుతున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతల పట్ల భరోసా లేకపోవడం వల్లే ఎమ్మెల్యేలు చేయిజారిపోతున్నారని చెబుతున్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ దారిలో న‌డ‌వాల‌ని డిసైడ‌య్యారు. 


2014లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడంతో దాన్ని ఎత్తేసేంత వరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు జగన్‌ ప్రకటించి ఆయనలో జనంలోకి వెళ్లారు. తాజాగా ఆయన అధికారంలోకి వచ్చారు. అధికార పార్టీపై ఒత్తిడి తేవ‌డంలో జ‌గ‌న్ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా జగన్‌ దారిలో నడవాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై నేతలు ఆలోచన చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, జ‌గ‌న్ అంత‌టి పోరాటం తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు చేయ‌గ‌ల‌రా? అంటే..కాల‌మే స‌మాధానం చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: