ఏపీలో వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కేబినెట్ శుక్ర‌వారం కొలువు దీరుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేబినెట్ కూర్పులో గ‌తంలో మంత్రులుగా ప‌నిచేసిన వారు ఉండ‌గా.. ఎక్కువ మంది మాత్రం తొలిసారి కేబినెట్ ప‌ద‌వి చేప‌డుతున్న వారే ఉన్నారు. గ‌తంలో మంత్రులుగా ఉన్న వారిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ లాంటి వారు ఉన్నారు. వీరికి కూడా ఇప్పుడు జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నందుకు కేబినెట్ బెర్త్ ద‌క్కింది. అయితే వీరితో పాటే కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏకంగా ప‌దేళ్ల పాటు మంత్రిగా ఉన్న మ‌రో సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సారావుకు మాత్రం మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. 


ముందు నుంచి ధ‌ర్మాన‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ప్ర‌చారం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది ఈ సారి మంత్రి ప‌ద‌వులు ఆశించినా ధ‌ర్మాన లాంటి రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వ్యక్తి కావాల్సిన నేప‌థ్యంలో శ్రీకాకుళం నుంచి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకే మంత్రి ప‌ద‌వి ఖాయం అని అంద‌రూ అనుకున్నారు. అయితే ధ‌ర్మాన‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డం వెన‌క జ‌గ‌న్‌కు ఆయ‌న‌పై అంత సానుకూల అభిప్రాయం లేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణం అయితే.. త‌న‌ను న‌మ్ముకుని ముందునుంచి త‌న వెన‌కే న‌డిచిన ధ‌ర్మాన సోద‌రుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌పై జ‌గ‌న్‌కు ఉన్న అపార‌మైన ప్రేమే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.


ధ‌ర్మాన కృష్ణ‌దాస్ జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న వెంట న‌డిచారు. 2012 ఉప ఎన్నిక‌ల‌కు ముందు కృష్ణ‌దాస్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని మ‌రీ రాజీనామా చేసి జ‌గ‌న్ వెంట న‌డిచి ఉప ఎన్నిక‌లు ఎదుర్కొని విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో సోద‌రుడిని ఎలాగైనా ఓడించాల‌ని భావించిన ధ‌ర్మాన త‌న మ‌రో సోద‌రుడు రామ‌దాసును రంగంలోకి దించారు. ఈ ఎన్నిక‌ల్లో కృష్ణ‌దాస్‌ను ఓడించేందుకు ధ‌ర్మాన విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. మంత్రిగా ఉండి న‌ర‌స‌న్న‌పేట‌లో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. అయినా చివ‌ర‌కు కృష్ణ‌దాస్‌నే విజ‌యం వరించింది.


వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా కృష్ణ‌దాస్ ఫ్యామిలీ ఆ పార్టీలోనే ఉంది. జ‌గ‌న్‌కు ఆయ‌న వీర విధేయుడిగా ఉంటూ వ‌చ్చారు. జ‌గ‌న్ వైసీపీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి ధ‌ర్మాన మంత్రి హోదాలో జ‌గ‌న్‌ను గ‌ట్టిగా టార్గెట్‌గా చేసుకుని ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తూ వచ్చారు. మాట మాట్లాడితే తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని దోపిడీ చేశార‌న్న విమ‌ర్శ‌లు చేసేవారు. ఈ వీడియోలు ఇప్ప‌ట‌కీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


ఇదిలా ఉంటే ధ‌ర్మాన రెవెన్యూ, మైనింగ్ మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణలు ఉన్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌తోనే ఆయ‌న మంత్రి ప‌ద‌వి కూడా పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవ‌ల జరిగిన ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు వ్య‌తిరేకంగా... ఆయ‌న ఓట‌మికి ప‌నిచేశార‌న్న నివేదిక‌లు కూడా జ‌గ‌న్‌కు వెళ్లాయ‌ట‌. ఈ కార‌ణాలు అన్ని ఇప్పుడు ధ‌ర్మాన‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌న్న చ‌ర్చ‌లు వైసీపీలో న‌డుస్తున్నాయి. అదే టైంలో త‌న‌ను న‌మ్మిన కృష్ణ‌దాస్‌కే ఆయ‌న ప‌ట్టం క‌ట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: