ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రేషన్‌ కార్డులు మార్చే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న కోన శశిధర్‌ ఈ కార్డుల మార్పునకు సంబంధించిన అంశాన్ని పరిశీలించనున్నారు. 


ఇప్పటికే పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్‌కార్డు రంగు, దానిపై ఉండాల్సిన చిహ్నాలు, ఫోటోలు తదితర అంశాలన్నింటినీ పొందుపర్చిన 5 రకాల కార్డు మోడళ్లను కమిషనర్‌కు అందించినట్లు సమాచారం. కమిషనర్‌ ఈ మోడళ్లను అన్నింటినీ పరిశీలించి, తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.


పాత రేషన్‌ కార్డులనే మార్చడానికే పరిమితం అవుతారా, లేక కొత్త రేషన్‌ కార్డుల మంజూరు కూడా చేస్తారా అనేది కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,81,886 రేషన్‌ కార్డులు ఉన్నాయి. జనవరి నెలలో జరిపిన కలెక్టర్ల సదస్సునాటికి కొత్త రేషన్‌ కార్డులకు 53,901 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6,777 దరఖాస్తులను తిరస్కరించారు. 
మిగిలిన దరఖాస్తులకు కార్డుల మంజూరు విషయాన్ని టిడిపి ప్రభుత్వం పక్కనబెట్టింది.


రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రంగు, చిహ్నాల మార్పులతో పాటు రేషన్‌ కార్డుల సంఖ్యలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయో లేదో వేచిచూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: