ఏపీలో న‌వ‌యువ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నారు. తాజాగా జ‌గ‌న్ కేబినెట్ కూర్పుపై ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. ముఖ్యంగా కేబినెట్‌లో సీనియర్లకు పెద్దపీట వేశారు జగన్. అలాగే అనూహ్యంగా ఊహించని వారికి మంత్రి పదవులు కేటాయించారు. ఇక కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ఇదిలా ఉంటే జ‌గ‌న్ కేబినెట్ కూర్పులో త‌న తండ్రి దివంగ‌త వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డినే బీట్ చేసేలా చేశాడ‌న్న ప్ర‌శంస‌లు రాజ‌కీయ వ‌ర్గాలు, విమ‌ర్శ‌కుల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఏకంగా ముగ్గురు మహిళ‌ల‌కు చోటు క‌ల్పించారు. వీరిలో కూడా రెండు ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌కు ఇస్తే, మ‌రొక‌టి ఎస్టీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు ఇచ్చి మ‌రి రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఇక అన్నింటికి మించి జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కీల‌క‌మైన హోం శాఖ‌ను తాను ఎంతో ముద్దుగా చేవెళ్ల చెల్లెమ్మ అని పిలుచుకునే స‌బితా ఇంద్రారెడ్డికి ఇచ్చి సంచ‌ల‌నం రేపారు.


కీల‌క‌మైన హోం శాఖ‌ను ఓ మ‌హిళ‌కు ఇవ్వ‌డం అప్ప‌ట్లో రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపింది. ఇప్పుడు జ‌గ‌న్ తండ్రి సంచ‌ల‌నాల‌ను మించిన సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. త‌న కేబినెట్‌లో హోం శాఖ‌ను మ‌హిళ‌కే ఇవ్వ‌గా... అది కూడా ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు ఇచ్చారు. స‌బితా ఇంద్రారెడ్డి ఓసీల్లో రెడ్డి వ‌ర్గానికి చెందిన వారు. ఇక తాజాగా జ‌గ‌న్ కేబినెట్‌లో హోం మంత్రి ప‌ద‌వి గుంటూరు జిల్లాకు చెందిన మేక‌తోటి సుచ‌రితకు ద‌క్కింది.


సుచ‌రిత పార్టీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ వెంటే ఉన్నారు. ఆమె మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జ‌గ‌న్‌కు వీర విధేయురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకుని మ‌రీ 2012 ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు ఆమె క‌ష్టానికి గుర్తుగా జ‌గ‌న్ ఆమెను కేబినెట్‌లోకి తీసుకోవ‌డంతో పాటు ఏకంగా మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. ఏదేమైనా ఓ ఎస్సీ మ‌హిళ‌ను హోం మంత్రిని చేసిన అరుదైన రికార్డు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికే ద‌క్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: