విజయసాయి రెడ్డి ట్విట్టర్లో పెట్టిన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ప్రత్యర్ధుల పై విరుచుకుపడటంలో విజయసాయి రెడ్డిది ప్రత్యేకమైన శైలి. అయితే కొత్తమంత్రులు ప్రమాణం చేసి జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ సీనియర్ నేత అయిన విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్లు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిస్తేజంగా తయారయ్యాయని.. రాజ్యాంగబద్ద వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.


ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రజల్లో వాటిపై విశ్వాసన్ని కల్పించాల్సిన బాధ్యత ఉందని హితవు పలికారు. కొత్త మంత్రివర్గం ఈ మేరకు పనిచేయాలని సూచించారు. పోలీస్ - ఐఏఎస్- ఐపీఎస్- రాష్ట్ర- జిల్లా స్థాయి పరిపాలన వ్యవస్థలన్నీ గాడి తప్పాయని.. వాటిని పట్టాలపై ఎక్కించాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి సూచించారు.జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. వాటిని వమ్ము చేయకుండా పరిపాలన సాగించాలని విజయసాయిరెడ్డి సూచించారు.


చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. జగన్ ఆలోచనలు ఆశయాల మేరకు పనిచేయాలని సూచించారు. జగన్ హామీలు నెరవేర్చే దిశగా మంత్రులు పనిచేయాలని సూచించారు.సంక్షేమం అభివృద్ధి జోడుగుర్రాల్లాగా పరుగులెత్తడం ఖాయమని విజయసాయిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం యావత్ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు.  ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేసి అణగారిన వర్గాలను మంత్రులు చేసి జగన్ ఓ వినూత్న ప్రయోగం చేశారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: