జనసేన పార్టీలో ఎవరూ ఊహించని రీతిలో మార్పు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు సాధించింది. ఇంతలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.  ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెదేపాలో చేరారు.

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన చంద్రబాబు హయాంలో కొన్నాళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి కోల్పోవడంతో తెదేపాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. 2018లో తెదేపాకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం జనసేనకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పవన్‌కు లేఖ పంపారు.

అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. దీంతో.. ఆయన తర్వాత చేరబోయే పార్టీ బీజేపీ అన్న విషయంపై స్పష్టత వచ్చినట్లుగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. రేపు తిరుపతికి వస్తున్న ప్రధాని మోడీ సమక్షంలో రావెల బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. రావెలతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పకతప్పదు.

ఈ క్రమంలో రాజీనామకు గల కారణాన్ని రావేల చెప్పకనే చెప్పేశారు.  రావెల.. తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో.. పార్టీ ఓటమిపై సమీక్షలు జరుపుతున్న పవన్ కు రావెల నిర్ణయం అశనిపాతంలా మారిందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇలాంటివి రానున్న రోజుల్లో ఖాయమన్న భావనలో ఉన్న పవన్.. ఇలాంటి షాకులకు మానసికంగా ప్రిపేర్ అయ్యారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: