వైఎస్ జగన్ క్యాబినెట్ కు సంబంధించిన మంత్రుల ప్రమాణస్వీకారం ఈరోజు జరిగింది.  25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  అందరికి సమన్యాయం పేరుతో అందరికి సమానంగా మంత్రి పదవులు కట్టబెట్టారు.  వైకాపాతో మొదటి నుంచి ఉన్న వ్యక్తులతో పాటు కాంగ్రెస్, టిడిపి నుంచి వచ్చిన వ్యక్తులు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వాళ్లలో ఉన్నారు. 
ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ప్రజారాజ్యం పార్టీకి చెందిన కొందరు కూడా నేతలు కూడా ఉండటం విశేషం.  


2009 ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.  కొన్ని కారణాల వలన రెండేళ్లకే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు.  ఇదిలా ఉంటె ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ప్రజారాజ్యం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం.  


అవంతి శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం తరపున భీమిలి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో తెదేపా తరపున అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఎన్నికలకు కొద్ది నెలల కిందటే వైకాపాలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తరువాత జర్నలిజం వృత్తిని వీడి రాజకీయాల్లోకి వచ్చారు కురసాల కన్నబాబు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వైకాపాలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ గ్రామీణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2009లో ప్రజారాజ్యం తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమయ్యాక 2014లో భాజపా టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైకాపాలో చేరి 2019లో తెదేపా అభ్యర్థి షబానాఖాతూన్‌పై గెలుపొందారు.

తెదేపాలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం 2009లో తెదేపా టిక్కెట్టు రాకపోవడంతో ప్రజారాజ్యం తరఫున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2014లో వైకాపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2019లో తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై భారీ మెజార్టీతో విజయం సాధించి నేడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు  


మరింత సమాచారం తెలుసుకోండి: