వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రికి ప‌ద‌వి చేప‌ట్టిన స్వ‌ల్పకాలంలోనే...ఊహించ‌ని షాక్ త‌గిలింది. అది కూడా కేంద్రం నుంచి సూచ‌న రూపంలో హెచ్చ‌రిక ద్వారా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని ఇటీవ‌ల సీఎం జగన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించింది. జ‌గ‌న్ నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మ‌ని పేర్కొంది. ఈ విష‌యం ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరింది. ఈ మేర‌కు ఓ లేఖ‌లో జ‌గ‌న్‌కు హిత‌వు ప‌లికింది.


విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలనపై కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనందకుమార్, ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని ఈ లేఖ‌లో హితవు పలికారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని, భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే అవకాశం ఉందని తెలిపారు. ఒప్పందాల్లో ఏదైనా కుట్ర జరగడం లేదా మితిమీరిన లబ్ధి చేకూరిందని రుజువైతే తప్ప ఒప్పందాలను పున:పరిశీలన చేయరాదని లేఖలో కేంద్రం ఆ లేఖ‌లో స్పష్టం చేశారు. అలా కానీ పక్షంలో గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. అదికూడా బహిరంగ వేళం ప్రక్రియలో సాగుతాయని గుర్తుచేసింది. 


2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాధక శక్తి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఇందన శాఖ గుర్తు చేసింది. ఇలాంటి సమయంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పున:పరిశీలన జరపడం సరికాదని స్పష్టం చేసింది. వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్‌కు వివరించాలని సుబ్రహ్మణ్యానికి ఇంధనశాఖ సూచించింది. జ‌గ‌న్‌కు రాసిన ఈ లేఖ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: