జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం తొలి ఝలక్  ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడు మీదున్న జగన్మోహన్ రెడ్డిని  కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నాన్ని చేసింది. గత ప్రభుత్వ హయం లో ఇచ్చిన పలు అనుమతులను సమీక్షించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెల్సిందే. సాగునీటి ప్రాజెక్టుల తో పాటు, ఇంజనీరింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావిస్తోన్న వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సమీక్షించడం ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వ హయం లో జరిగిన  అవినీతిని బట్టబయలు చేయవచ్చునని భావిస్తూ వచ్చింది.


 దానిలో భాగంగానే  ఏపీ నూతన  ముఖ్యమంత్రిగా పదవి బాధత్యలు చేపట్టిన తరువాత జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వ హయం లో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించారు. అంతటితో ఆగకుండా అవసరమైతే వాటిని మార్చి మళ్ళీ నూతన ఒప్పందాలు చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శికి,  రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై  కేంద్రం ఇంధన  శాఖ కార్యదర్శి అనంత్ కుమార్ ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం చేసుకున్న  విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించడం సరైన నిర్ణయం కాదని, దీనివల్ల పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం కు రాసిన లేఖలో అనంత్ కుమార్ పేర్కొన్నారు.


దేశ వ్యాప్తంగా 2022  నాటికీ ఇంధన రంగం లో 175 గిగావాట్ల పునరుద్పాక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 100 గిగావాట్ల సోలార్ పవర్, 60 గిగావాట్ల విండ్ పవర్, 10 గిగావాట్ల ఇంధనాన్ని బయోమాస్ ద్వారా, మరో ఐదు గిగావాట్ల ఇంధనాన్ని చిన్న హైడ్రో ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తిని చేయాలని నిర్ణయించింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయం లో చేసుకున్న ఇంధన ఒప్పందాల్ని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి ఒకవేళ రద్దు చేయాలనుకుంటే మొదటికే మోసం వస్తుందని కేంద్రం భావిస్తోంది.  ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కి తెలియజేయాలని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి, రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: