వెల్‌ బిగినింగ్‌... బి కేర్‌ ఫుల్‌ జగన్‌!! 
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ఆరునెలల్లో మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పిన జగన్‌ ఆరు రోజుల్లోనే అద్భుత సీఎంగా అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు... ఫార్టీ ప్లస్‌, వయసులో తన కష్టార్జితంతో ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌ సీటులో కూర్చున్నప్పటి నుంచి తీసుకుంటున్న ప్రతీ నిర్ణయంలో ఒక నిబద్ధత కనిపిస్తోంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూనే ఒకమాట చెప్పారు.
తాను సంక్షేమ కార్యక్రమాల అమలులో కులం చూడను, పార్టీ చూడను. ప్రాంతం చూడను.. అర్హులైన ఎవరైనా తనకు ఒకటే అని స్పష్టంచేశారు.అదొక్కటే ఆయనలోని పరిణితిని చాటే అంశం. అంతేకాక ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ముందుగా అవ్వా,తాతల పెన్షన్‌ను పెంచారు. జగన్‌ పాదయాత్రలో, ఎక్కువ మంది అవ్వ, తాతలను చూశాడు. వారి కన్నీళ్లు, దుర్భర జీవితాలను గమనించారు. అందుకే ముందుగా ఆయన వారికి పెన్షన్‌ పెంచారు. బిడ్డలు పట్టించుకోని ఎందరో ముసలి తల్లిదండ్రులకు ఇదొక భరోసా. ఉద్దానం కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తానన్న హామీని వెంటనే నిలబెట్టుకున్నారు. ఆశా వర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచడం కూడా, జగన్‌లోని మానవీయ కోణం చాటే అరుదైన సంఘటనలు.

 జగన్‌ నిర్ణయాలను గమనిస్తే, సమాజంలో అట్టడుగున ఉండి, అనేక కష్టాలు పడుతున్న వారికి జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థం అవుతుంది. ఇవే కాదు, మద్య నిషేధంపై కూడా దశలవారీగా చేస్తామని చెప్పారు. బెల్ట్‌షాపుల ఎత్తివేత అన్నది అంత తేలికైన విషయంకాదు. రాజకీయంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్న విషయం ఇది. అయినా జగన్‌ నిర్భయంగా 'బెల్ట్‌' తీశారు..

 మొన్నటి ఎన్నికల్లో, చంద్రబాబు, వనప్‌ కళ్యాణ్‌ రెండు రాష్ట్రాల మద్య ఉద్రిక్తతలు ఏర్పడే విధంగా, పవన్‌ అయితే పదే,పదే తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే జగన్‌ అందుకు భిన్నంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించారు. అలాగే కేంద్రంలో ప్రధాని మోడీని కలవడం, ఆయన నుంచి సహకారం పొందడానికి హామీ తెచ్చుకోగలగడం వంటివి కూడా జగన్‌కు ఉపకరించే అంశం అవుతుంది.

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మహిళలకు రాజకీయంగా మహోన్నత స్థానాన్ని కల్పించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ముగ్గురు మహిళలకు ఆయన తన మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాక వారిలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా మహిళలకు తానెంతటి గుర్తింపునిచ్చేది చెప్పారు. కరుపాం ఎమ్మెల్యే  పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా నియమించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖను కేటాయిస్తే,
ఇక అత్యంత కీలకమైన హోం శాఖను దళిత మహిళకు కేటాయించడం ఒక సామాజిక విప్లవమే. ఇది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ నుండి ఇప్పటి విభజన వరకు రాజకీయ చరిత్రలోనే రికార్డ్‌.
 వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో తొలిసారి రాష్ట్రంలో సబితా ఇంద్రారెడ్డిని హోంమంత్రిని చేశారు. తండ్రి స్ఫూర్తిని తనయుడు వైఎస్‌ జగన్‌ కొనసాగిస్తూ తన మంత్రివర్గంలో హోం మంత్రిగా దళిత మహిళ మేకతోటి సుచరితను నియమించి చరిత్రను పునర్లిఖించారు. ఇక మహిళా, సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనితకు అవకాశం కల్పించారు.

వైఎస్‌ జగన్‌ దళితులకు రాజకీయంగా అత్యున్నత గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. అంతే కాకుండా ఏకంగా ఐదు మంత్రి పదవులు కేటాయించడం ద్వారా దళిత వర్గాలకు తాను ఎంతటి ప్రాధాన్యమిస్తోంది చేతల్లో చూపించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కలత్తూరు నారాయణస్వామిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కీలకమైన అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖలను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది .

సీనియర్‌ సంపాదకుడు రామచంద్రమూర్తి అన్నట్టు... 
'' రహస్య మంతనాలు లేవు. సుదీర్ఘమైన సమాలోచనలు లేవు. వీడియో కాన్ఫ రెన్స్‌లు లేవు. ఊహాగానాలు లేవు. శషభిషలు లేవు. ఒత్తిళ్ళు లేవు. ముందుకూ, వెనక్కూ లాగడాలు లేవు. చివరి క్షణంలో నిర్ణయాలు మార్చడాలూ, పేర్లు చేర్చడాలూ, తొలగించడాలూ లేవు. సస్పెన్స్‌ అసలే లేదు. ఎన్నికలలో అభ్య ర్థులను ఖరారు చేయడం, మంత్రివర్గంలో సభ్యులను నిర్ణయించడం, వారికి శాఖలు కేటాయించడం ఇంత తేలికా? అని ఆశ్చర్యబోయే విధంగా పనులు కంప్యూటర్‌లో ప్రోగ్రామింగ్‌ చేసినట్టు సాఫీగా, చకచకా జరిగిపోవడం పరిశీలకులకు విస్తుగొలుపుతున్నది...''
అయితే, పాలనలో జగన్‌ తొలి అడుగులు కాబట్టి, ప్రతిపక్షాలు,పత్రికలు ప్రభుత్వ నిర్ణయాలపై అపుడే విమర్శలు చేయవు కానీ,
రాబోయే రోజుల్లో... విమర్శలు,విశ్లేషణలు వస్తాయి... 
పోలవరం మీద, రాజధాని మీద, ప్రత్యేక హోదా మీద జగన్‌ వైపు నుండి ఇంకా క్లారిటీ లేదు....
ఇక పై జగన్‌ వేగం తగ్గించి, జాగ్రత్తగా అడుగులు వేయాలి. కీప్‌ ఇట్‌ అప్‌, జగన్‌ గారూ... 


మరింత సమాచారం తెలుసుకోండి: