తమ్ముడు జగనా,
విద్య, వైద్యం మీద నువ్వు చాలా మాట్లాడావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఒక్కసారి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు మన చదువు"కొన్న" విధ్యార్ధుల శక్తి సామర్ధ్యాల మీద వెలిబుచ్చిన
అభిప్రాయాలను తెలుసుకో.
నీ తండ్రి దేవుడు అనిపించుకోవడానికి కారణమైన పాలసీలలో ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ ఒకటి. దాని మీద నాలాంటి సామాన్యుల అభిప్రాయాలను చెపుతున్నాను, జాగ్రత్తగా చేతులు కట్టుకొని విను.
నీ తండ్రి సదాశయంతో మొదలుపెట్టాడు, దానిని ఎవరూ కాదనలేరు, ఆర్ధిక స్థోమత లేక చదువుకోలేకపోవడం అనేది ఆ వ్యక్తి కంటే కూడా దేశానికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.
దానికి ఉదాహరణ నేనే. నా తండ్రి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్‌‍గా చేసారు. అటువంటి ఆయన నన్ను ఇంజనీరింగ్ చదివించకుండా డిప్లొమా చదివించడానికి ఒకటే కారణం, నాకు ఇంజనీరింగ్ చదివేటంతటి బుర్ర లేదని. ఇక్కడ నన్ను డిప్లొమా చదివించడానికి కారణం ఆర్ధిక, సామాజిక స్థితిగతులు కారణం కాదు, పూర్తిగా నా తత్వం, నాకున్న కష్టపడేతత్వం, జ్ఞానం. ఇదే ప్రతీ మనిషికీ వర్తిస్తుంది. 
నువ్వు కూడా ముఖ్యమంత్రి కొడుకువైనా, నీకు ఆ పదవి ఊరికే రాలేదు, చాలా కష్టపడ్డావు, నువ్వే కాదు నీ కుటుంబం కూడా  అవమానాల పాలైనారు, రాష్ట్రం అంతా కాలినడకన తిరిగావు. అంత కష్టపడితే కానీ నువ్వు ఈ స్థాయికి రాలేదు. 


అదే కష్టం, ఈ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ పడాలి, ఏదీ ఉచితంగా రాకూడదు. నువ్వు నీ కంపెనీలో ఎవరికీ కూర్చోబట్టి జీతాలు ఇవ్వవు కదా. నీ రూపాయికి ఎలా వంద పైసలో, ప్రజలమైన మేము కట్టే రూపాయికి కూడా వంద పైసలే. నీ డబ్బుని నువ్వు ఎలా వాడుకుంటున్నావో ప్రజల డబ్బుని కూడా అలాగే వాడు. 
నువ్వు ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ ఇవ్వడానికి కొంత విచక్షణ ఉపయోగించు. ఎవరైతే కనీసం యాభై శాతం మార్కులు తెచ్చుకుంటారో వారికి మాత్రమే దానిని వర్తింపచెయ్యి. కావాలంటే హాస్టల్ వసతి ఉచితంగా కల్పించు. ఎందుకంటే పల్లెల నుండి వచ్చే బీద పిల్లలకు బయట రూం తీసుకొని ఉండడం కూడా ఆర్ధికంగా భారమే. వాళ్ళకు కాలేజీ సముదాయంలోనే హాస్టల్ వసతి కలిగించి, యాభై శాతం మార్కులు ఖచ్చితంగా రావాలనే రూల్ పెట్టు. అవి రాని వారికి ఆ తరువాత సంవత్సరం ఫీజ్ ప్రభుత్వం (అంటే మేము, నువ్వూ కట్టిన పన్నులు) కట్టకూడదు.


అలాగే నీ కంపెనీలలో అందరూ ఇంజనీర్సే ఉండరు. ఒక ఇంజనీర్ దగ్గర నలుగురు సూపర్‌వైజర్లు, ఒక్కో సూపర్‌వైజర్ దగ్గర నలుగురు ట్రేడ్స్‌మెన్, ఒక్కో ట్రేడ్స్‌మన్ దగ్గర ఒక్కో హెల్పెర్ ఉంటారు. అంటే ఒక ఇంజనీర్‌కు నలుగురు డిప్లొమా వాళ్ళు, ఒక్కో డిప్లొమా అతని దగ్గర నలుగురు ఐటిఐ వాళ్ళు, ఒక్కో ఐటిఐ అతని దగ్గర ఒక్కో వర్కర్ ఉంటాడు. కానీ మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్కూల్స్ కంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. నాణ్యమైన విద్యనందించే కాలేజీలు చేతి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

ముందు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ముప్పాతిక వంతు మూసేయించు. అసలు అన్ని కాలేజీలలో పని చెయ్యడానికి సరిపడా అధ్యాపకులు మన దగ్గర లేరు. కావాలంటే, ఇప్పుడు నువ్వు మంత్రి పదవి ఇవ్వబోతున్న అవంతీ శ్రీనివాస్ కాలేజీలకే వెళ్ళి చూడు. ఒక ఇంజనీరింగ్ కాలేజీకి నాలుగు పాలిటెక్నిక్స్ చొప్పున, పదహారు ఐటిఐల చొప్పున నెలకొల్పించు. ఫీజ్ ప్రభుత్వం కట్టాలంటే, ఖచ్చితంగా యాభై శాతం మార్కులు, డభై శాతం హాజరూ ఉండాలనే నిబంధన తీసుకొనిరా. మెరికల్లాంటి కుర్రవాళ్ళు తయారు అవుతారు. 


నువ్వు పేపర్లలో చదివే ఉంటావు, ఇంజనీరింగ్ చదివి, ప్యూన్ ఉద్యోగం చేస్తున్నాడు అని, అతని మేధో స్థాయి అదే, అటువంటి వాడికి ఉచితంగా ఇంజనీరింగ్ పట్టా ఇవ్వడం వలన అతనికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవడమే కాకుండా, అతని జీవితాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే, అతనిని పెళ్ళి చేసుకున్న మనిషి ఇంజనీరింగ్ చదివి, నువ్వు చేసే ఉద్యోగం ఇదా అని నిత్యం దెప్పి పొడుస్తూనే ఉంటుంది.

కాబట్టి విద్య మీద సరైన నిర్ణయం తీసుకో. ఇన్ని ఉచితాలు ఇస్తూ, మనం దేశం బాగుపడాలని కోరుకోవడం మూర్ఖత్వం, కూర్చోబెట్టి మేపుతూ, వాడిలో నైపుణ్యం, వాడి ద్వారా అభివృద్ధి కోరుకోవడం అనేది కలల్లో మాత్రమే కనాలి. ఈ విషయంలో నేను నీకు ఏమీ సలహా ఇవ్వలేను, ఇచ్చినా నువ్వే కాదు, ఎక్కడో మా మోడీలాంటి వాళ్ళు తప్ప ఎవరూ చెయ్యలేరులే. అది వృధా ప్రయాస.

ఇట్లు 

ఓ సామాన్యుడు .


మరింత సమాచారం తెలుసుకోండి: