ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం అంశం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. 2011 ఏప్రిల్ 30న బార్కస్‌లో ఓ ఎన్నికల ర్యాలీ సందర్భంగా అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. పహిల్వాన్ వర్గానికి చెందిన కొంత మంది అక్బరుద్దీన్‌పై అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ ఆ తర్వాత ఆస్పత్రిలో కోలుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే, తాజాగా ఆయ‌న ఆరోగ్యం మ‌ళ్లీ క్షీణించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 


దాడి ఘటనలో గాయపడిన అక్బ‌రుద్దీన్‌కు ఆనాటి నుంచి అప్పటినుండి చికిత్స కొనసాగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనారోగ్యం కారణంగా అక్బరుద్దీన్  ఎన్నికల సభల్లోనూ పాల్గొనలేదు. ఆయన పాల్గొనాల్సిన రెండు, మూడు సభలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే పాత‌బ‌స్తీలో ఆయ‌న మాట్లాడుతూ...``‘కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా. నా కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. కిడ్నీల దగ్గర కొన్ని బుల్లెట్ ముక్కలు అలాగే ఉండిపోయాయి. కొన్ని రోజుల కిందటే పరిస్థితి చేయి దాటి పోయింది. డాక్టర్లు నన్ను డయాలసిస్ చేసుకోమని సూచించారు’ అని చెప్పారు. కాగా, తాజాగా, అక్బ‌రుద్దీన్ ఆరోగ్య‌ పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం లండన్‌కు తరలించార‌ని తెలుస్తోంది. అక్బ‌రుద్దీన్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాల‌ని ఆయ‌న సోద‌రుడు, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కోరిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఎంఐఎం పార్టీ తరఫున తెలంగాణ అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా ఉన్న అక్బరుద్దీన్ చాంద్రయాణగుట్ట నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ‌త ఏడాది ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రానున్న ప్రభుత్వంలో ఎంఐఎం కీలక పాత్ర వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో జేడీఎస్ తరహాలో తెలంగాణలోనూ తాము పాత్ర పోషించే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. సీఎం పదవి కూడా చేపడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: