ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాజకీయంగా యూటర్న్ తీసుకోబోతున్నారా ? ఆమె తిరిగి తన పాత గూడు అయినా వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా ? అంటే కర్నూలు జిల్లా రాజకీయ వర్గాలలో ప్రస్తుతం అవున‌నే ఆన్సర్‌లు వినిపిస్తున్నాయి. భూమా కుటుంబానికి వైయస్ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి భూమా కుటుంబాన్ని ఎంతో గౌరవించేవారు.  2009 ఎన్నికలకు ముందు వైఎస్ భూమా కుటుంబాన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే వారు మాత్రం ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు.


అయితే వారు మాత్రం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ మృతి తర్వాత భూమా దంపతులు జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి విజయం సాధించారు. ఇక శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి వైసిపి అభ్యర్థిగా బరిలో ఉండి ఎన్నికలకు వారం రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ అదే సీటు నుంచి అఖిల ప్రియ రంగంలోకి దింపి ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ తమ కుటుంబానికి చేసిన కృతజ్ఞతలు మరిచిన ఆ ఫ్యామిలీ పదవుల కోసం టిడిపిలోకి జంప్ చేసేసింది. 


భూమా నాగిరెడ్డి కి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. బాబు మంత్రి పదవి ఇవ్వకుండానే టిడిపి వాళ్లు చేసిన చర్యలతో తీవ్ర ఆందోళ‌న‌కు గురై గుండె పోటుతో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌పై విమ‌ర్శ‌లు రాకుండా ఉండేందుకే అఖిల‌ప్రియ‌కు త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు  మంత్రి అఖిల ప్రియకు సీటు ఇవ్వ‌రన్నా వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ ఉండడంతో చంద్రబాబు ఇద్దరికి సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. అయితే అఖిలప్రియ బెదిరించడంతో చివరకు చంద్రబాబు తిరిగి వారిద్దరికీ సీట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ వైసీపీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. టిడిపిలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని డిసైడ్ అయిన అఖిలప్రియ ఇప్పుడు తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 


జగన్ తల్లి వైఎస్ విజయమ్మతో ఉన్న సంబంధాల నేపథ్యంలో  అఖిలప్రియ పార్టీలో చేరేందుకు ఆ యాంగిల్‌లో ప్రయత్నాలు చేస్తోందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అఖిలప్రియ వైసీపీలో చేరిన ఆమెకు పార్టీలో ఎలాంటి ప్రయార్టీ ఉండదు. జగన్ ఆళ్లగడ్డ సీటును గంగుల ఫ్యామిలీకి ఇచ్చారు. ఎన్నికల్లో అక్కడ గంగుల బ్రిజేంద్రారెడ్డి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించింది. ఇలాంటి టైమ్ లో అఖిలప్రియ పార్టీలోకి తీసుకునేందుకు వారు అంగీకరిస్తారా ? అన్నది కూడా సందేహమే. వైసీపీలో చేరితే ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా  మాజీ మంత్రి హోదాలో ప్రయార్టీ దక్కకపోదా ? అన్న ఆశతోనే అఖిల ప్రియ విజయమ్మ ద్వారా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. మరి జగన్ తిరిగి అఖిలను పార్టీలో చేర్చుకుంటారో ? లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: