ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన జగన్ కేబినెట్ కూర్పు ఎట్టకేలకు పూర్తయింది. జగన్‌తో పాటు 25 మంది మంత్రులు ఆయన కేబినెట్‌లో కొలువు తీరారు. వీరిలో ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ముందు నుంచి అందరూ ఊహించినట్టుగానే కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి కేబినెట్ బెర్త్‌ లభించింది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే చంద్రబాబుతో తీవ్రంగా విభేదించి వైసీపీలోకి వెళ్ళిన నాని ఆ ఎన్నికల్లో కూడా గుడివాడ నుంచి విజయం సాధించారు. 


తాజా గెలుపుతో వరుసగా నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికైన నాని ఏకైక కమ్మ సామాజిక వర్గం నేత కావటం విశేషం. జగన్‌కు నమ్మిన బంటు కావడంతోపాటు  2014 ఎన్నికలకు ఏడాది ముందే చంద్రబాబు సవాల్ చేసి మరి వైసీపీలో చేర‌డంతో జగన్ నానికి కీలకమైన శాఖ అప్పగిస్తారన్న‌ అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. కీలకమైన కృష్ణ జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నానికి రవాణా లేదా జల వనరుల శాఖలో ఏదో ఒకటి కేటాయించే సూచనలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. నానీకి రవాణా రంగంలో అనుభ‌వం ఉంది. అందుకే ఆయనకు రవాణా శాఖ మంత్రి పదవి చేస్తారని అనుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ జలవనరుల శాఖ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావుకు, కొడాలి నానికి మధ్య రాజకీయంగా తీవ్రమైన వైరుధ్యం ఉంది. వీళ్లిద్దరు ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో తలపడ్డారు.


దేవినేని ఉమా అసెంబ్లీలో పదేపదే జగన్‌ను టార్గెట్‌గా చేసేవారు. ఇక జిల్లా రాజకీయాల్లో కూడా ఉమాతో ఢీ అంటే ఢీ అనే రీతిలో నానిని ఢీ కొట్టారు. ఈ క్రమంలోనే ఉమాను టార్గెట్ చేసే క్రమంలో నానికి కీలకమైన జలవనరుల శాఖ అయినా దక్కుతుందని అందరూ భావించారు. అయితే జగన్ జలవనరుల శాఖ నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌కు ఇచ్చారు. నానికి పౌరసరఫరాల శాఖ కేటాయించారు. నానికి పౌరసరఫరాల శాఖ కేటాయించడం వెనక జగన్ లాజిక్ ఉందని తెలుస్తోంది. నాని పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. చదువుతో సంబంధం లేకుండా ఆయన మాస్ లీడర్‌గా ఎదిగి గుడివాడ ప్రజల హృదయాల్లో కొలువ‌య్యారు. 


కీలక శాఖలకు ఉన్నత చదువులతో పాటు, టెక్నాలజీపై కాస్తంత అవసరం. జలవనరుల శాఖ ఎక్కువగా టెక్నాలజీతో లింక్ ఉంటుంది. ఈ క్రమంలోనే నానికి జగన్ పౌరసరఫరాల శాఖ కేటాయించినట్లు తెలుస్తోంది. నానికి వ్యవసాయం అంటే మక్కువ. అలాగే ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాల‌పై కూడా టిడిపి ప్రభుత్వ హయాంలో పోరాటం చేశారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే జగన్ నానికి పౌరసరఫరాల శాఖ కేటాయించినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: