- 2 నెలల క్రితం తండ్రి హత్య ... పెంపుడు కొడుకుపైనే సందేహాలు 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్మాకోలనీలో జరిగిన  దారుణ హత్యా ఘటన రెండు నెలల ఆలస్యంగా సోమవారం వెలుగులోకొచ్చింది. తాగివచ్చి తరచూ వేధిస్తున్నాడనే కోపంతో తండ్రిని హత్య చేసి మృత దేహాన్ని ఇంటి పక్కనే పూడ్చిన ఘటన, మద్యం మత్తులో కొడుకే ఈ విషయాన్ని   బయటపెట్టడంతో వెలుగులోనికి వచ్చింది. మృతుని భార్యపై కూడా అనుమానాలుండడంతో ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీస్ లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 


గోపిరెడ్డి ఈశ్వరరావు(55) కు భార్య లక్ష్మి , ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సీజనల్ ఫ్రూట్స్  వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ముగ్గురూ కుమార్తెలే కావడంతో అతని అన్నగారి కుమారుడైన కుమార్ ను దత్తత తీసుకున్నారు. చిన్ననాటి నుంచి వారితోనే ఎదిగాడు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు పూర్తి కావడంతో వారు తమ అత్తవారింటికి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఈశ్వరరావు అతని భార్య, కుమారుడు  కుమార్ బర్మా కాలనీలో ఉంటున్నారు. 


ఈశ్వర రావు తరచు మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. దాంతో లక్ష్మి, కుమార్ అతనిని వారించేవారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 17న తల్లి, కొడుకు కలిసి తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈశ్వర రావు కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి తిమ్మాపురం పోలీసులు, కుటుం సభ్యులు అతని కోసం గాలిస్తున్నారు. సుమారు రెండు నెలలు గడిచిపోతున్నా ఆచూకీ తెలియ లేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందసాగారు. 


ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి అతని స్నేహితులతో కలిసి తప్పతాగిన కుమార్ నిజాన్ని దాయలేక అతని చిన్నాతో జరిగిన వాస్తవాన్ని చెప్పాడు.  ఏప్రిల్ 16న మద్యం మత్తులో వచ్చిన ఈశ్వర్ రావు యధాలాపంగా భార్యతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కుమార్  తండ్రితో వాగ్వివాదానికి దిగి క్షణికావేశంలో ఇనుప వస్తువుతో బలంగా కొట్టాడు. అతడు మృతిచెందడంతో ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టేసి గుర్తుగా రెండు కర్రలు పెట్టినట్టు అతని చిన్నన్నకు చెప్పాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఆందోళనకు గురైన కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసాడు. 


నిందితుడు కుమార్ ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా  చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు, తిమ్మాపురం పోలీసులు ఫోరెన్సిక్ వైద్యుల సమక్షములో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టుమ్ నిర్వచించారు. మృతుడు ఈశ్వర రావు భార్య ప్రమేయం ఈ హత్యోదంతంలో  ఉండవచ్చని పోలీస్ లు సందేహిస్తూ ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: