తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు. పార్టీ నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసే క్ర‌మంలో ఆయ‌న తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల నుంచి 8 నుంచి హైద్రాబాద్ ఇందిరాపార్క్ దగ్గర సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  ఫిరాయింపుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన భ‌ట్టి దీక్ష‌ను సోమ‌వారం ఉదయం పోలీసులు భ‌గ్నం చేశారు. భట్టి విక్రమార్కను దీక్షా స్థలం నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి నిమ్స్ కు తరలించారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకునేవరకు దీక్ష కొనసాగిస్తానంటూ నిమ్స్ లో భట్టి చికిత్సకు సహకరించలేదు. అయితే, ఈ క్ర‌మంలో రాహుల్ రంగంలోకి దిగారు.


నిమ్స్ లో చేరిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రజా సమస్యలపై న్యాయపోరాటం కొనసాగించాలని సూచించారు. దీక్షను విరమించాలని కోరడంతో భట్టి అంగీకరించారు. పార్టీ ముఖ్య నేతలు, భట్టికి నచ్చచెప్పి దీక్ష విరమింపచేశారు. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నేతలు భట్టికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.


ఇదిలాఉండ‌గా, హైదరాబాద్: 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై.. హైకోర్టులో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క పిటిషన్ వేశారు . సీఎల్పీ విలీనంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీసీసీ నేతలు పిటిషన్ వేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ విలీనం జరగలేదని.. దీనిని పరిగణించకుండా… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని పిటిషన్ లో కోరారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు విన్నవించారు.మంగళవారం నాడు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానుంది. 


కాగా, భట్టి విక్రమార్క ప్రాణాలకు తెగించి  దీక్ష చేశారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు . విక్రమార్కతో దీక్ష విరమింప చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్యేల కొనుగోలు చేశారని ఉత్తమ్ అన్నారు. ఈ విషయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహారించారని చెప్పారు. పిరాయింపు ఎమ్మెల్యేలపై రేపు కోర్టులో కేసు విచారణకు రానుందని చెప్పారు ఉత్తమ్. ఈ విషయంలో రాష్ట్రపతిని కలువనున్నట్లు తెలిపారు. MIM పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనున్నట్లు తమదగ్గర సమాచారం ఉందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన MIM పార్టీకి ఎలా ప్రతాపక్ష హోదా ఇస్తారో కేసీఆర్ ప్రజలకు తెలపాలని ఉత్తమ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: