ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారాలు కూడా పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం బాగా ప‌ని చేస్తోంద‌న్న కితాబులు కూడా వ‌స్తున్నాయి. పార్టీకి కూడా మంచి పేరు వ‌స్తోంది. అప్పుడే పార్టీ నేత‌ల్లో కొంద‌రు సంయ‌మ‌నం కోల్పోతున్నారు. బ‌హిరంగ వేదిక‌ల మీదే వార్నింగ్‌లు ఇచ్చుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వెళుతోంది. విశాఖ వైసీపీలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఓపెన్‌గానే మాట‌ల యుద్ధం న‌డిచింది. జిల్లా నుంచి మంత్రిగా చోటు ద‌క్కించుకున్న రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు విశాఖ‌లో స‌న్మానం ఏర్పాటు చేశారు.


న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడు బొమ్మ‌న‌బోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆధ్వ‌ర్యంలో ఈ స‌న్మానం జ‌రిగింది. ఈ స‌న్మాన వేదిక మీదే చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (ఈ ఎన్నిక‌ల్లో నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు) మ‌ధ్య మాటల యుద్ధం నడిచింది. ముందుగా ఈ స‌భ‌లో ధ‌ర్మ‌శ్రీ మాట్లాడుతూ రూర‌ల్ జిల్లాతో పాటు ఏజెన్సీలో అన్ని సీట్లు గెలుచుకున్నామ‌ని.. న‌గ‌రంలో ఉన్న నాలుగు సీట్ల‌లో ఓడిపోయామ‌ని... ఆ లోటు తీర్చేందుకు మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని అన్నారు. జీవీఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇక్క‌డ కార్య‌క‌ర్త‌ల కోసం, న‌గ‌రంలో పార్టీని ముందుకు నడిపేలా అవంతి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. వెంట‌నే మైక్ తీసుకున్న ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ద్రోణంరాజు ధ‌ర్మ‌శ్రీకి కౌంట‌ర్‌గా మాట్లాడారు.


ఇక్క‌డ కొంత‌మంది నేత‌లు ఏ మాత్రం అవ‌గాహన లేకుండా మాట్లాడుతున్నార‌ని... దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళుతుంద‌న్నారు. అవంతి ఒక ప్రాంతానికో జిల్లాకో మంత్రి కాద‌ని.. రాష్ట్రం మొత్తానికి మంత్రి అని చెప్పారు. అలాంటిది ఆయ‌న నాయ‌క‌త్వంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ముందుకు వెళ‌దామ‌ని రాంగ్ గైడెన్స్ ఇచ్చేలా మాట్లాడ‌డం స‌రికాద‌ని... ఈ విష‌యంలో మొదటిసారి హెచ్చరిస్తున్నానని ముగించారు. వెంటనే తిరిగి ధర్మశ్రీ మైకు అందుకుని ద్రోణంరాజు మాట‌ల‌కు విర‌ణ ఇచ్చుకునే ప్రయ‌త్నం చేశారు. తాను తప్పుడు సంకేతాలిచ్చానని కొంతమంది చెప్పడం విడ్డూరంగా ఉందని, జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపుని దృష్టిలో పెట్టుకుని కూడా అవంతికి మంత్రి పదవి ఇచ్చారని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. ఏదేమైనా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు ఓపెన్‌గానే ఒక‌రిపై ఒక‌రు ఇలా మాట్లాడుకోవ‌డంతో అక్క‌డున్న పార్టీ నేత‌లు అంతా అవాక్క‌య్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: